వీఎంసీలో 9 గ్రామాల విలీనమే లక్ష్యం: యార్లగడ్డ వెంకట్రావు
వెంకమ్మ పేరంటాలమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే
ఆషాఢ సారె సమర్పించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన యార్లగడ్డ
విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ: విజయవాడ రూరల్ మండలంలోని తొమ్మిది గ్రామాలను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ)లో విలీనం చేయడమే తన ప్రధాన లక్ష్యమని గన్నవరం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. శుక్రవారం రామవరప్పాడులోని శ్రీ వెంకమ్మ పేరంటాలమ్మ దేవస్థానంలో ఆషాఢ మాస ఉత్సవాల సందర్భంగా శాకాంబరీ దేవిగా అలంకరించిన అమ్మవారిని ఆయన దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాజులబజార్లోని అమ్మవారి పుట్టింటి నుంచి మంగళవాయిద్యాల నడుమ ఆషాఢ మాస సారెను సమర్పించిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన యార్లగడ్డ వెంకట్రావు ఆలయ అభివృద్ధికి కమిటీ ఏర్పాటు చేసినప్పుడు నిర్దేశించుకున్న లక్ష్యాల్లో 90 శాతం ఇప్పటికే సాధించామని తెలిపారు. పల్లకీ సేవను ప్రారంభించడంతో పాటు ప్రతి శుక్రవారం 600 నుంచి 1000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆలయం మరింత అభివృద్ధి చెంది అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
అనంతరం విజయవాడ రూరల్ మండలంలోని రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమానూరు, గూడవల్లి, అంపాపురం, నైనవరం, పాతపాడు, నున్న గ్రామాల సమస్యలపై మాట్లాడారు. ఈ తొమ్మిది గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా మౌలిక సదుపాయాల కొరతతో ఇబ్బందులు పడుతున్నారని, 40 నుంచి 50 ఏళ్లుగా ద్వితీయ శ్రేణి పౌరుల్లా జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కృష్ణానది కేవలం అర కిలోమీటరు దూరంలో ఉన్నప్పటికీ సుమారు లక్షన్నర మంది ప్రజలు అధిక టిడిఎస్ ఉన్న తాగునీటిని వినియోగించాల్సి వస్తోందన్నారు. కొన్ని ప్రాంతాల్లో టిడిఎస్ స్థాయి 800 నుంచి 3000 వరకు నమోదవుతోందని, ఇది ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు.
తాగునీరు, డ్రైనేజీ, చెత్త నిర్వహణ, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం వీఎంసీలో విలీనం ద్వారానే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. తొమ్మిది గ్రామాల విలీన అంశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి మరోసారి తీసుకెళ్తానని తెలిపారు. అవసరమైతే గన్నవరం వరకు గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌ను విస్తరించాలని కోరుతానన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లను కలిసి ఈ అంశంపై చర్చిస్తానని వెల్లడించారు.
రామవరప్పాడులో విద్యుత్ హెచ్చుతగ్గుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రెండు 33 కేవీ సబ్స్టేషన్లను మంజూరు చేసిందని చెప్పారు. ఒక సబ్‌స్టేషన్ ప్రారంభానికి సిద్ధంగా ఉండగా, మరొకదానికి భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.
గన్నవరంలో చెత్త సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని, డంపింగ్ యార్డు సమస్యను అధిగమించేందుకు చెత్తను జిందాల్ ప్లాంట్‌కు తరలిస్తున్నామని వివరించారు.
కార్యక్రమంలో సీహెచ్.ఎన్. రామారావు, ఆలయ కమిటీ చైర్మన్ పట్టపు చంటి, ఆలయ ఈవో ప్రియాంక, గ్రామ పార్టీ అధ్యక్షుడు నాబిగాని కొండయ్య, క్లస్టర్ ఇన్చార్జి కొల్లా ఆనంద్, మాజీ సర్పంచ్ అద్దేపల్లి సాంబశివ నాగరాజు, బొమ్మసాని అరుణకుమారి, కొంగన రవి, మున్నంగి సత్యనారాయణ, మేకల స్వాతి, పరుచూరి నరేష్, సర్నాల బాలాజీ, మొక్కపాటి చైతన్య, ఉలాస శివ, కళ్లేపల్లి రామకృష్ణరాజు, విజ్జి నాగరాజు, అడ్డగిరి రామకృష్ణ, పుట్టి నాగరాజు, రత్నం నాగేశ్వరరావు, సంధ్య, గంధం గోవర్ధనరావు, కునపురెడ్డి నాని, మల్లిఖార్జునరావు, కూటమి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
