Andhra-Prabha-Effect : అంబులెన్స్ దందా కు ఫాక్​ Andhra Prabha Top News

Andhra-Prabha-Effect : అంబులెన్స్ దందా కు ఫాక్​ Andhra Prabha Top News

  • మాతృశాఖకు డిప్యూటీ సీఎంఆర్‌ఓ సరెండర్
  • సర్వీస్ ప్రొవైడర్‌కు షోకాజ్ నోటీసు
  • మంత్రి సత్యకుమార్ ఆదేశాలతో విచారణ..
  • తక్షణ చర్యలు తీసుకున్న డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్
  • జీజీహెచ్‌లో కలెక్టర్ లక్ష్మీ శా ఆకస్మిక తనిఖీలు
  • సేవల్లో లోపాలపై అధికారులు సిబ్బందిపై ఆగ్రహం
  • అంబులెన్స్ సేవలు పూర్తిగా ఉచితం..
  • డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్ హెచ్చరిక
  • టోల్‌ఫ్రీ నంబర్‌తో స్టిక్కర్లు..
  • వెలుగులోకి తెచ్చిన ఆంధ్రప్రభకు ప్రజల అభినందనలు..

( ఎన్టీఆర్ బ్యూరో ఆంధ్రప్రభ)

Andhra-Prabha-Effect : విజయవాడ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి (న్యూ జీజీహెచ్)లో మృతదేహాల తరలింపునకు సంబంధించిన అంబులెన్స్ సేవల్లో జరుగుతున్న అక్రమాలను వరుస కథనాల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చిన ఆంధ్రప్రభ ప్రచురణలకు ప్రభుత్వం స్పందించింది. నిరుపేదల శవాల తరలింపులో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం, బాధ్యులపై చర్యలు ప్రారంభించింది. మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ విష్ణువర్ధన్ విచారణ జరిపి, విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన విజయవాడ న్యూ జీజీహెచ్ డిప్యూటీ సీఎంఆర్‌ఓ మంగాదేవిని మాతృశాఖకు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సంబంధిత అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడర్‌కు కూడా షోకాజ్ నోటీసు జారీ చేశారు.

.. కలెక్టర్ ఆకస్మిక తనిఖీ…

ఆంధ్రప్రభ కథనాలతో అప్రమత్తమైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ శ స్వయంగా న్యూ జీజీహెచ్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సేవలను పరిశీలించిన కలెక్టర్, ఓపీ విభాగంలో నేరుగా రోగులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సేవల విషయంలో నిర్లక్ష్యం సహించబోమని వైద్య సిబ్బందిని హెచ్చరించారు. ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ‘మహాప్రస్థానం’ అంబులెన్స్ సేవలను పరిశీలించిన కలెక్టర్, మృతదేహాల తరలింపునకు ఒక్క రూపాయి కూడా వసూలు చేయరాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న అంబులెన్స్ సేవలు పూర్తిగా ఉచితమని, ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మృతదేహాలను ఉచితంగా వారి స్వగ్రామాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. అనంతరం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్, అంబులెన్స్ సేవలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేలా ప్రతి వాహనంపై “అంబులెన్స్ సేవలు పూర్తిగా ఉచితం” అనే స్టిక్కర్లతో పాటు ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ మేరకు ఆసుపత్రిలోని అంబులెన్స్లపై స్టిక్కర్లు ఏర్పాటు చేశారు.

Andhra-Prabha-Effect : ఆంధ్రప్రభ కు ప్రశంసలు…

అంబులెన్స్ సేవల పేరుతో జరుగుతున్న దోపిడీని వరుస కథనాల ద్వారా వెలుగులోకి తీసుకువచ్చిన ఆంధ్రప్రభకు రోగుల బంధువులు, సామాన్య ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. పేదల సమస్యపై మీడియా కథనాలకు ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు చేపట్టడం అభినందనీయమని వారు పేర్కొన్నారు