డీసీసీబీ సీనియర్ అధికారులకు న్యాయం చేయాలి..

  • విజయవాడ ధర్నా చౌక్‌లో ఏపీసీసీబీఓఏ శాంతియుత ధర్నా
  • హైకోర్టు కేసు ఉపసంహరణ షరతు అప్రజాస్వామికమని ఉద్యోగుల ఆగ్రహం
  • 60 మంది సీనియర్ అధికారులకు వెంటనే వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్
  • ఉద్యోగ, ట్రేడ్ యూనియన్ సంఘాల సంఘీభావం

విజయవాడ, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల (డీసీసీబీలు) సీనియర్ అధికారులకు పెండింగ్‌లో ఉన్న వేతన సవరణను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల సీనియర్ ఆఫీసర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడ ధర్నా చౌక్‌లో శాంతియుత ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలు ఉద్యోగ సంఘాలు, ట్రేడ్ యూనియన్ నాయకులు హాజరై సంఘీభావం ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సహకార శాఖ సర్వీసెస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జి. నారాయణరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో ఏజీఎం కేడర్ వరకు సుమారు 3,000 మంది ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేసినప్పటికీ, డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్, సీఈఓ స్థాయి 60 మంది సీనియర్ అధికారులను మాత్రం పక్కన పెట్టడం అన్యాయమని విమర్శించారు. వేతన సవరణ అమలుకు 2023లో దాఖలైన హైకోర్టు కేసును ఉపసంహరించుకోవాలనే షరతు విధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.

న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధ హక్కు అని, ఆ హక్కును కాలరాసే విధంగా షరతులు విధించడం సమంజసం కాదన్నారు. ఈ అంశంపై సహకార బ్యాంకుల యాజమాన్యం పునరాలోచన చేసి, డీసీసీబీ సీనియర్ అధికారుల వేతన సవరణను ఎలాంటి షరతులు లేకుండా వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను కోరారు.

ఈ ధర్నాలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్, కార్యనిర్వాహక అధ్యక్షుడు సీహెచ్. అజేయ్ కిషోర్, ముఖ్య ఉపాధ్యక్షుడు విజయచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎన్. రంగబాబు, కోశాధికారి కె. జయలక్ష్మి, ఏపీ ఎన్‌జీఓ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు డి. సత్యనారాయణరెడ్డి, ఏపీ కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. గోపినాథ్, సహకార సంఘ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు జే. రామాంజనేయులు, డీసీసీబీల సీనియర్ అధికారులు, ఉద్యోగులు, పలు బ్యాంకు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొని ఉద్యమానికి మద్దతు తెలిపారు.