ధవళేశ్వరం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక.!

  • గోదావరికి పెరుగుతున్న వరద ఉద్ధృతి
  • లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణ సంస్థ

అమరావతి, ఆంధ్రప్రభ : గోదావరి నదికి వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) తెలిపింది. శుక్రవారం రాత్రి 8 గంటల నాటికి ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద 5.39 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో నమోదైనట్లు వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ రాత్రి తొలి ప్రమాద హెచ్చరిక, శనివారం రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

వరద పరిస్థితుల నేపథ్యంలో తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మూడు ఎన్‌డీఆర్‌ఎఫ్, మూడు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలు ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని సూచించారు. అలాగే వాగులు, వంకలు, కాజ్‌వేలు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. గోదావరి నదిలో స్నానాలు, ఈత, చేపల వేటకు వెళ్లవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 112, 1070, 1800 425 0101 టోల్‌ఫ్రీ నంబర్లను సంప్రదించాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.