సరసమైన ధరలకు నాణ్యమైన బియ్యం
తిరుపతి కలెక్టరేట్, ఆంధ్రప్రభ: ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన బియ్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ (ఎంఐపీ)ను ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనుంది. తిరుపతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని శనివారం ఉదయం 10 గంటలకు తిరుపతి రైతు బజార్‌తో పాటు జిల్లాలో గుర్తింపు పొందిన 41 రైస్ మిల్లుల విక్రయ కేంద్రాల్లో ప్రారంభించనున్నట్లు జాయింట్ కలెక్టర్ గోవిందరావు తెలిపారు.
పథకం కింద ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు రైస్ కార్డు కలిగిన కుటుంబాలకు బియ్యం విక్రయిస్తారు. స్టీమ్ బీపీటీ బియ్యాన్ని కిలో రూ.52, రా బీపీటీ బియ్యాన్ని కిలో రూ.50 చొప్పున అందుబాటులో ఉంచనున్నారు. రైస్ కార్డు నంబర్ నమోదు చేసి ప్రతి కుటుంబం నెలకు గరిష్టంగా 26 కిలోల బియ్యాన్ని కొనుగోలు చేయవచ్చు. ఒక రైస్ కార్డుకు నెలలో ఒక్కసారి మాత్రమే ఈ సదుపాయం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. కార్యక్రమ అమలును జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు పర్యవేక్షిస్తారని, బియ్యం నాణ్యత, నిల్వలు, ధరలు, తూకాలపై నిరంతర తనిఖీలు నిర్వహిస్తారని వెల్లడించారు.
