Jal-Vahak-Scheme : భలే భలే పడవ ప్రయాణం Andhra Prabha Top News
Jal-Vahak-Scheme : భలే భలే పడవ ప్రయాణం Andhra Prabha Top News
- ఏపీలో జలరవాణపై కేంద్రం దృష్టి
- జలమార్గాల అబివృద్ధికి పెద్ద పీట
- పర్యావరణహిత రవాణాకు ప్రాధాన్యం
- లోక్ సభలో ఎంపీ చిన్ని ప్రశ్న
- కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ క్లారిటీ
(ఆంధ్రప్రభ,ఎన్టీఆర్ బ్యూరో )
Jal-Vahak-Scheme : దేశంలో అంతర్గత జల రవాణాను బలోపేతం చేసి తక్కువ వ్యయంతో, పర్యావరణహిత సరుకు రవాణాను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్ వాహక్ పథకం ఆశాజనక ఫలితాలు ఇస్తోందని కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్ని) లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, జల్ వాహక్ పథకం కింద ఇప్పటివరకు 12 మంది కార్గో యజమానులు నమోదు చేసుకోగా, వారిలో ఏడుగురికి ఆమోదం లభించింది. అయితే ప్రోత్సాహకాల కోసం ఇప్పటివరకు ఏ కార్గో యజమాని కూడా క్లెయిమ్ దాఖలు చేయకపోవడంతో ఎలాంటి ఆర్థిక ప్రోత్సాహకాలు విడుదల చేయలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జాతీయ జలమార్గం–1 (వారణాసి–కోల్‌కతా), జాతీయ జలమార్గం–2 (కోల్‌కతా–పాండు–గౌహతి) మార్గాల్లో ఎనిమిది అంతర్గత జల రవాణా నౌకలతో క్రమబద్ధమైన షెడ్యూల్డ్ సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు. కోల్‌కతా–వారణాసి మార్గంలో నౌకల సగటు సామర్థ్య వినియోగం 79.34 శాతం, కోల్‌కతా–పాండు మార్గంలో 71.05 శాతంగా నమోదైందని పేర్కొన్నారు. ఒక్కో ప్రయాణానికి సగటు వ్యయం వరుసగా రూ.21.44 లక్షలు, రూ.33.32 లక్షలుగా ఉందని వివరించారు. జల్ వాహక్ పథకంపై టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్, బిర్లా వైట్ సిమెంట్ వంటి ప్రముఖ సంస్థలు సానుకూల స్పందన వ్యక్తం చేశాయని కేంద్ర మంత్రి తెలిపారు. షెడ్యూల్డ్ సేవలతో అంతర్గత జల రవాణాపై పరిశ్రమల్లో విశ్వాసం పెరిగి, సరుకు రవాణా మరింత సులభతరమైందని ఆయా సంస్థలు వెల్లడించినట్లు పేర్కొన్నారు.2025–26 ఆర్థిక సంవత్సరంలో జాతీయ జలమార్గాలు–1, 2పై నిర్వహించిన షెడ్యూల్డ్ సేవలు వార్షిక లక్ష్యంతో పోలిస్తే 104.7 శాతం సరుకు రవాణా వృద్ధిని నమోదు చేయడం ఈ పథకం విజయానికి నిదర్శనమని మంత్రి వివరించారు. దేశంలో లాజిస్టిక్స్ వ్యయాన్ని తగ్గించి పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు మరింత ఊతమివ్వడంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లో అంతర్గత జలమార్గాల అభివృద్ధి, సరుకు రవాణా అవకాశాల విస్తరణకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఆయన వెల్లడించారు.
