థియేటర్ల లైసెన్సులు లేకపోతే ‘సినిమానే’
బకాయిలు వెంటనే చెల్లించి ఎన్ఓసీలు పూర్తి చేయాలని ఆదేశం
తిరుపతి కలెక్టరేట్, ఆంధ్రప్రభ: జిల్లాలోని సినిమా థియేటర్ల లైసెన్సులు, ఎన్ఓసీల మంజూరు, డిజిటల్ సినిమా స్క్రీన్ల వివరాలు, పెండింగ్ పరిపాలనా రుసుములపై జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు శుక్రవారం థియేటర్ యాజమాన్యాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న రుసుములను వెంటనే చెల్లించి, ఎన్ఓసీల మంజూరు లేదా పునరుద్ధరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.
జిల్లాలో మొత్తం 32 సినిమా థియేటర్లు ఉండగా, వాటిలో 31 డిజిటల్ స్క్రీన్లు యూఎఫ్ఓ, క్యూబ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని అధికారులు తెలిపారు. యూఎఫ్‌ఓలో 20, క్యూబ్‌లో 11 స్క్రీన్లు ఉన్నట్లు వెల్లడించారు. జిల్లాలోని 20 థియేటర్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎన్ఓసీల మంజూరు లేదా పునరుద్ధరణ కోసం నమోదు చేసుకున్నాయని తెలిపారు.
వీటిలో 14 థియేటర్లకు రూ.7.32 లక్షల పరిపాలనా రుసుములు బకాయిగా ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ఫారం-బి లైసెన్స్, ఎన్ఓసీల మంజూరు లేదా పునరుద్ధరణ ప్రక్రియను పూర్తి చేయలేదని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, థియేటర్ యాజమాన్యాలు పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, అవసరమైన అన్ని లైసెన్సులు, ఎన్ఓసీలు పొందాలని సూచించారు.
