రూ.3 కోట్ల ఆయుర్వేద కళాశాల భవనానికి శంకుస్థాపన..
రూ.3 కోట్ల ఆయుర్వేద కళాశాల భవనానికి శంకుస్థాపన..
విజయవాడ సెంట్రల్లో అభివృద్ధి జోరు!
విజయవాడసెంట్రల్, ఆంధ్రప్రభ : సుమారు రూ.3 కోట్ల వ్యయంతో బందరు రోడ్డులోని డా. నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల నూతన భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు బుధవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయుర్వేద విద్యాసంస్థలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆయుష్ శాఖ కారణంగా గత పదిహేనేళ్లుగా ప్రజల్లో ఆయుర్వేదంపై అవగాహన, విశ్వాసం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. నేచురల్ ట్రీట్మెంట్స్కు ప్రజలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు.
సెంట్రల్ నియోజకవర్గంలో ఈ ప్రతిష్టాత్మక కళాశాల ఉండటం గర్వకారణమని బొండా ఉమా తెలిపారు. ఇక్కడ చదివే విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం తరఫున, స్థానిక శాసనసభ్యుడిగా తాను ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి, చింతా దుర్గారావు, బుల్లయ్య, ఆసుపత్రి యాజమాన్యం, మెడికల్ విద్యార్థులు పాల్గొన్నారు.
