వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
- డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ యశోద
చౌటుప్పల్, ఆంధ్రప్రభ :
వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ డిఎంహెచ్వో లక్ష్మీపురం యశోద తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, బహిరంగ ప్రదేశాల్లో ఎండలో పనిచేసే కార్మికులు ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఎండ వేడిని తట్టుకోవడం కోసం ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని, రోజువారీగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, పండ్ల రసాలతో పాటు పుచ్చ పండ్లు, తాటి ముంజలను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది. ఎండ తీవ్రత సమయంలో బయటకు వెళ్లరాదు: ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయట తిరగకూడదు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ లేదా తలపై వస్త్రాన్ని తప్పనిసరిగా ధరించాలి. శరీరాన్ని కాపాడుకునేందుకు తేలికపాటి, తెలుపు లేదా లేత రంగులో ఉండే వదులైన పత్తి (కాటన్) దుస్తులు ధరించడం ఎంతో మంచిది. ఎండలో ఎక్కువసేపు శారీరక శ్రమతో కూడిన పనులు చేయకూడదు. మద్యం, కాఫీ, టీ వంటి పానీయాలు, నూనె ఎక్కువగా ఉండే ఫ్రై చేసిన ఆహార పదార్థాలను తీసుకోకపోవడం ఉత్తమం.
గట్టిగా ఉండే నలుపు రంగు దుస్తులను ధరించవద్దు.
పిల్లలను, వృద్ధులను వాహనాల్లో ఒంటరిగా వదిలివెళ్లడం, ఎండలో ఆడుకోనివ్వడం చేయరాదు.
వడదెబ్బ లక్షణాలు – ప్రాథమిక చికిత్స..
అధిక జ్వరం, తలనొప్పి, తల తిరగడం, వాంతులు, అలసట, శరీరంపై చెమట ఆగిపోవడం వంటివి వడదెబ్బ ప్రధాన లక్షణాలని డిప్యూటీ డిఎంహెచ్వో తెలిపారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే బాధితుడిని వెంటనే చల్లని ప్రదేశానికి తరలించి, శరీరంపై చల్లని నీరు పోయాలని, ఓఆర్ఎస్ లేదా మంచి నీరు తాగించాలని సూచించారు. పరిస్థితి తీవ్రంగా ఉంటే ఆలస్యం చేయకుండా సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తరలించాలన్నారు. అన్ని ఆరోగ్య ఉప కేంద్రాలు (సబ్ సెంటర్లు), గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఓఆర్ఎస్ప్యా కెట్లు అందుబాటులో ఉంచామని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని డాక్టర్ యశోద కోరారు.
