ఆన్‌లైన్ ఫార్మసీలను రద్దు చేయాలి
ఆన్‌లైన్ ఫార్మసీలను రద్దు చేయాలి
- చౌటుప్పల్ లో మెడికల్ షాపులు బంద్, ర్యాలీ
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: ఆల్ ఇండియా కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపులో భాగంగా బుధవారం చౌటుప్పల్ మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులందరూ కలిసి చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు.
ఈ ర్యాలీ, నిరసన కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు తిరందాసు ధనుంజయ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఆన్‌లైన్ మందుల అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఆన్‌లైన్ ఫార్మసీ వ్యాపారాన్ని పూర్తిగా బంద్ చేయాలని, ప్రజలు కూడా ఆన్‌లైన్‌లో మందులు కొనుగోలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఆయన హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు అయ్యాడపు ప్రతాప్ రెడ్డి, కార్యదర్శి తిరందాస్ వెంకటేష్, ఉపాధ్యక్షులు గర్దాస్ నరసింహ, దూడెల రమేష్, తొర్పునూరు వెంకటేష్, కార్యవర్గ సభ్యులు కటికం ప్రశాంత్, రచ్చ వెంకటరమణ, భాస్కర్, శ్రీకాంత్, వినోద్ కుమార్, రాజు, గణేష్, శ్రవణ్ కుమార్ తదితర మెడికల్ షాపుల యజమానులు, అసోసియేషన్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

