భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై వినతిపత్రం..

మునుగోడు, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ మంగళవారం మునుగోడు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు వరికుప్పల ముత్యాలు మాట్లాడుతూ, జీవో నెం.12ను రద్దు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను వెల్ఫేర్ బోర్డు ద్వారానే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే సీఎస్సీ హెల్త్ టెస్టులను రద్దు చేసి, పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లను వెంటనే పరిష్కరించాలని కోరారు. 55 ఏళ్లు నిండిన కార్మికులకు నెలకు రూ.6 వేల పెన్షన్, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు, లేబర్ కార్డులను త్వరగా అందజేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షుడు ఎర్రవరపు వెంకట్రావు, మండల కమిటీ సభ్యులు మాదరబోయిన నరసింహ, జి. ఉదయభాస్కర్, వేముల విజయ్ తదితరులు పాల్గొన్నారు.