అజయ్ ఫాస్ట్ ఫుడ్, చికెన్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలి
అజయ్ ఫాస్ట్ ఫుడ్, చికెన్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలి
-జీపీలో ఫిర్యాదు
కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ: అజయ్ ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ పాయింట్, రెస్టారెంట్, చికెన్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలని కమ్మర్ పల్లి గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మల్యాల సుభాష్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ రేంజర్ల మహేందర్ వేరు వేరుగా బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్, పంచాయతీ కార్యదర్శి ఏనుగంధుల గంగజమునలకు ఫిర్యాదు చేశారు. జాతీయ రహదారి 63 ప్రక్కన గల సున్నం మోహన్ దుకాణ సముదాయంలో అజయ్ ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు.
పరిసరాల పరిశుభ్రత లోపించడం, కుళ్ళిపోయిన వ్యర్థ పదార్థాలు మురికి కాలువలో పడేయడం వల్ల స్థానికంగా నివసించే తమకు మురికి కాలువ నుంచి దుర్గంధం వెదజల్లుతోందని, రోగాల బారిన పడే అవకాశం ఉందని ఫిర్యాదుదారుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి 10 గంటల తర్వాత ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ పాయింట్‌ను కడిగిన వ్యర్థపు నీరు ఉప్లూర్ రోడ్డు నుంచి తమ ఇంటి వరకు వస్తున్నాయని, ఫాస్ట్ ఫుడ్ వ్యర్థాలను ఊరి చివరన పడేయాలని, ఫాస్ట్ ఫుడ్ సెంటరును శుభ్రం చేసినప్పుడు రోడ్డు పైకి వ్యర్థపు నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మల్యాల సుభాష్ గౌడ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అలాగే హాస కొత్తూరు రోడ్డులో గల అజయ్ చికెన్ సెంటర్, బిర్యానీ పాయింట్, రెస్టారెంట్ నుంచి కోళ్లకు సంబంధించిన చెడు వ్యర్థాలను మురికి కాలువలో పడేయడం వల్ల దుర్గంధం వెదజల్లుతోందని, మురికి కాలువలపై దోమలు చేరి విష జ్వరాలు వస్తున్నాయని ఫిర్యాదుదారుడు వాపోయారు. చికెన్ సెంటర్ పై రెస్టారెంట్ నిర్వహించడం వల్ల పక్కనే నివాసం ఉంటున్న తమ కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా ఉందని, అజయ్ చికెన్ సెంటర్‌ను ప్రజల నివాసాలకు దూరంగా జరిపి చికెన్ అమ్మకాలు జరపాలని, రెస్టారెంట్‌ను తీసివేసి చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని సొసైటీ డైరెక్టర్ రేంజర్ల మహేందర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
