రైతుల సంక్షేమానికి కృషి చేస్తా

రైతుల సంక్షేమానికి కృషి చేస్తా

–పీఎసీఎస్ చైర్మన్ కాకిరాల హరి ప్రసాద్

తొర్రూరు, ఆంధ్రప్రభ: రైతుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని పీఎసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ అన్నారు. హైకోర్టు ఆదేశానుసారం పీఎసీఎస్ పాలకవర్గాలను పునరుద్ధరించిన నేపథ్యంలో బుధవారం డివిజన్ కేంద్రంలోని పీఎసీఎస్ కార్యాలయంలో చైర్మన్ కాకిరాల హరి ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనను డైరెక్టర్లు, కార్యాలయ సిబ్బంది శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని అన్నారు.

మండలంలోని తొర్రూరు పెద్దవంగర మండలాల్లో 31 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, తొర్రూరు, సోమారం గ్రామాల్లో మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 1.9 లక్షల క్వింటాళ్ల ధాన్యం కాంటా అయిందని, 31 వేల క్వింటాళ్ల ధాన్యం తరలించినట్లు పేర్కొన్నారు. రైతులకు అకాల వర్షాల భయం ఉందని, రైతులు అధైర్య పడవద్దని, పీఎసీఎస్ అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. రవాణా సమస్యను అధిగమిస్తామని, కాంటా అయిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లుకు తరలించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా గ్రామ సర్పంచులు సహకరించాలని కోరారు. త్రాగునీరు, ఇతర చిన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా రైతులకు సహకరించాలన్నారు. రైతు పక్షపాతిగా వ్యవహరిస్తానని, రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ సీఈవో శ్రీనివాస్,డైరెక్టర్లు జక్కుల పాపిరెడ్డి, వల్లపు లింగయ్య, అనపురం రవి, యనమల ప్రమీల, సర్పంచులు కొమురవెల్లి లింగమూర్తి,నలుగురి రామలింగం, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.