15వ వార్డులో హస్తం జెండా రెపరెపలు..
15వ వార్డులో హస్తం జెండా రెపరెపలు..
గెలుపు దిశగా కాంగ్రెస్ అభ్యర్థి చింతల వసంత ప్రచార ప్రభంజనం..
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం క్లైమాక్స్‌కు చేరుతుండటంతో బెల్లంపల్లి 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. శుక్రవారం సాయంత్రం అభ్యర్థి చింతల వసంత ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ప్రచార ర్యాలీ వార్డును హోరెత్తించింది. వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు వార్డు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఆమెకు సంఘీభావం తెలపడంతో వార్డులో ‘హస్తం’ జెండా రెపరెపలాడుతోంది. ర్యాలీ పొడవునా మహిళలు చింతల వసంతకు మంగళ హారతులు పట్టి, తిలకం దిద్ది ఘనస్వాగతం పలికారు. అడుగడుగునా లభిస్తున్న ఈ అపూర్వ స్పందన చూస్తుంటే 15వ వార్డులో కాంగ్రెస్ విజయం ఇప్పటికే ఖాయమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ సందర్భంగా చింతల వసంత గడప గడపకూ వెళ్లి ఓటర్లను కలుస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందుతున్న ఆరు గ్యారెంటీ పథకాల గురించి వివరించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ అండదండలతో వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఆమె ఓటర్లకు భరోసా ఇచ్చారు. వార్డు అభివృద్ధి కోసం ఆమె ప్రకటించిన 10 సూత్రాల ప్రణాళికకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నూతన డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం, స్వచ్ఛమైన తాగునీరు , యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.
ఈ భారీ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవసాని శ్రీనంద్, దెబ్బేటి రమేశ్, కన్నూరి వెంకటేశ్వర్లు, బొల్లి వంశీ, చింతల బాలరాజు, పులియాల మల్లేష్, కాశిపాక జీవరత్నం, రామ్ లక్ష్మీనారాయణ, చింతల లోకేశ్వర్, బొల్లి వంశీలతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తల ఉత్సాహం, ప్రజల మద్దతు చూస్తుంటే 15వ వార్డులో చింతల వసంత భారీ మెజార్టీతో గెలవబోతున్నారని నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
