పంతంగి టోల్‌గేట్ వద్ద 23 పశువుల అక్రమ రవాణా పట్టివేత

పంతంగి టోల్‌గేట్ వద్ద 23 పశువుల అక్రమ రవాణా పట్టివేత

​చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్‌గేట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 23 పశువులను పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఇన్‌స్పెక్టర్ జి. మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్హెచ్ఓ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ నరేష్, సీతారాంరెడ్డి, శ్రీను బృందం పంతంగి చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వచ్చిన డీసీఎం (టీఎస్ 12యూడీ 6308) వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న 10 ఆవులు, 4 ఎద్దులు, 9 దూడలు కలిపి మొత్తం 23 పశువులు లభ్యమయ్యాయి.

డ్రైవర్ రమావత్ శరత్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా దాసరి వీరబాబు ఆదేశాల మేరకు జగ్గంపేట సంతలో వీటిని కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు అంగీకరించాడు. ​ఈ మేరకు డ్రైవర్, వాహన యజమాని పత్లావత్ రాజు, పశువుల కొనుగోలుదారు వీరబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పశువులను సురక్షిత ప్రాంతానికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.