రోడ్డు ప్రమాదం.. లారీ డ్రైవర్ మృతి

రోడ్డు ప్రమాదం.. లారీ డ్రైవర్ మృతి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: గుర్తుతెలియని వ్యక్తి అకస్మాత్తుగా బైక్‌కు అడ్డం రావడంతో జరిగిన ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ అక్కడికక్కడే మరణించిన సంఘటన మంగళవారం తూప్రాన్‌పేట గ్రామ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ జి మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం తూప్రాన్‌పేట గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ బక్కతట్ల జంగయ్య (57) మంగళవారం తన బైక్ (ఏపీ 24 ఏబీ 3273) పై పని నిమిత్తం తూప్రాన్‌పేట నుండి హైదరాబాద్‌కు బయలుదేరారు.
మార్గమధ్యలో భాస్కర్ ఆగ్రో కెమికల్ కంపెనీ సమీపానికి చేరుకోగానే ఓ గుర్తుతెలియని బిచ్చగాడు అకస్మాత్తుగా రోడ్డుకు అడ్డం వచ్చాడు. ఈ క్రమంలో బైక్ అతడిని ఢీకొట్టడంతో ఇద్దరూ కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో జంగయ్య తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. గాయపడిన మరో వ్యక్తిని స్థానికులు అంబులెన్స్‌లో చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జంగయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అదే ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి కుమారుడు బక్కతట్ల నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ మన్మధ కుమార్ పేర్కొన్నారు.
