Telangana Assembly | అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

Telangana Assembly | అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

హాజరైన కేసీఆర్
దివంగత సభ్యులకు సంతాపం


Telangana Assembly | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు (Telangana Legislative Assembly Winter Session) షెడ్యూల్ ప్రకారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యాయి. జాతీయ గీతాలాపనతో సమావేశాలను ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దివంగత సభ్యులకు సంతాపం తెలిపారు.

స్పీకర్ (Speaker) మాట్లాడుతూ… తుంగతుర్తి, సూర్యాపేట ఎమ్మెల్యేగా పనిచేసి మరణించిన మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మణ్ రెడ్డిలకు సభ్యులు నివాళులర్పించారు. సభలో దివంగత సభ్యులకు రెండు నిమిషాల మౌనం పాటించారు.

అనంతరం జీరో అవర్‌లో వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) మాట్లాడుతూ… తిరుమల తిరుపతిలో తెలంగాణ భక్తులు వసతి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా తిరుమలలో తెలంగాణ భవనం నిర్మించాలని, అలాగే శబరిమలలో కూడా తెలంగాణ భవనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యుత్తరంగా మంత్రి జూపల్లి కృష్ణారావు ఆ సూచనలను నోట్ చేసుకున్నట్లు ప్రకటించారు.

అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కేసీఆర్…


తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ (Opposition leader KCR) శాసనసభకు హాజరయ్యారు. దివంగత మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కొండా లక్ష్మారెడ్డిలకు శాసనసభ సంతాపం తెలిపింది. ఈ క్రమంలోనే కేసీఆర్‌ వద్దకు సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లి పలకరించారు. ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. సంతాప తీర్మానాల అనంతరం కేసీఆర్‌ సభ నుంచి వెళ్లిపోయారు.