12 గంటల్లోనే తప్పిపోయిన బాలికల ఆచూకీ..
సాంకేతిక ఆధారాలతో గుర్తించిన పోలీసులు
నాలుగు ప్రత్యేక బృందాల గాలింపు..
పోలీసు సిబ్బందిని అభినందించిన డీసీపీ
సుల్తానాబాద్, ఆంధ్రప్రభ: సుల్తానాబాద్ పట్టణంలోని బాలసదన్ చిల్డ్రన్స్ హోమ్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను సుల్తానాబాద్ పోలీసులు కేవలం 12 గంటల్లోనే గుర్తించి సురక్షితంగా అధికారులకు అప్పగించారు.
మార్కండేయ కాలనీలోని బాలసదన్ చిల్డ్రన్స్ హోమ్ నుంచి బుధవారం ఇద్దరు మైనర్ బాలికలు ప్రహరీ గోడ దూకి వెళ్లిపోయిన విషయం తెలియగానే పెద్దపల్లి డీసీపీ రామ్‌రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక బృందాన్ని పెద్దపల్లికి, మరో బృందాన్ని కరీంనగర్‌కు, ఇంకో బృందాన్ని స్థానికంగా సమాచార సేకరణ కోసం, మరొక బృందాన్ని బాలికల్లో ఒకరి బంధువుల గ్రామమైన పాలితం ప్రాంతానికి పంపించి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, ప్రయాణ మార్గాలు, ఇతర సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు.. బాలికలు సుల్తానాబాద్ చౌరస్తా నుంచి ఆటోలో పెద్దపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లి, అక్కడి నుంచి రైలులో భువనగిరికి, అనంతరం బస్సులో నల్గొండకు వెళ్లినట్లు గుర్తించారు.
నల్గొండ బస్టాండ్‌లో ఉన్న ఇద్దరు బాలికలను పోలీసులు తప్పిపోయిన 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించి రక్షించారు. అనంతరం వారిని భద్రంగా తీసుకువచ్చి సంబంధిత అధికారులకు అప్పగించారు.
ఈ ఆపరేషన్‌లో సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పొన్నమనేని రంజిత్‌రావు, ఎస్హెచ్ఓ చంద్రకుమార్, హెడ్ కానిస్టేబుల్ మహేందర్, కానిస్టేబుళ్లు వెంకటేష్, రవి, రమేష్, అరుణ్, సదానందం, రేణుకతో పాటు టెక్నికల్ టీమ్ సభ్యులు సమన్వయంతో పనిచేసి బాలికలను వేగంగా గుర్తించి రక్షించడంలో కీలక పాత్ర పోషించారు.
ఈ సందర్భంగా డీసీపీ రామ్‌రెడ్డి ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారులు, పోలీసు సిబ్బందిని అభినందించి నగదు రివార్డులు అందజేశారు.
