కాలుష్య రహిత సమాజాన్ని నిర్మిద్దాం..
కాలుష్య రహిత సమాజాన్ని నిర్మిద్దాం..
సిరిసిల్ల, (ఆంధ్రప్రభ): పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, కాలుష్య రహిత వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ‘వనమహోత్సవం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ, ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో కలిసి కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా అటవీ సంపద క్రమంగా తగ్గిపోతుండటం, పచ్చదనం స్థానంలో కాంక్రీట్ నిర్మాణాలు పెరిగిపోతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. వాహనాలు, పారిశ్రామిక ప్రాంతాల నుండి వెలువడుతున్న కాలుష్యం కారణంగా పర్యావరణ సమతుల్యత తీవ్రంగా దెబ్బతింటోందని ఆయన పేర్కొన్నారు.
సమయం కాని వర్షాలు.. అధిక ఉష్ణోగ్రతలు:
పర్యావరణ క్షీణత వల్ల వాతావరణ పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఎస్పీ తెలిపారు. సమయానికి వర్షాలు కురవకపోవడం, వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం వంటి పరిణామాలు ప్రజల జీవన విధానంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని హెచ్చరించారు. ప్రస్తుత ఈ దుష్పరిణామాలకు ప్రధాన కారణం పచ్చదనం తగ్గిపోవడమేనని, కాబట్టి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరు విస్తృత స్థాయిలో మొక్కలు నాటడంతో పాటు, వాటిని నాటి వదిలేయకుండా బాధ్యతగా సంరక్షించాలని కోరారు. అప్పుడే రాబోయే తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించగలమని స్పష్టం చేశారు.
పాల్గొన్న అధికారులు: ఈ వనమహోత్సవ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు రవి, మధుకర్, ఆర్ఎస్ఐలు మధుకర్, సురేష్, రమేష్‌లతో పాటు పలువురు ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటారు.
