ఇరికేపల్లిలో రూ.1.02 కోట్ల తారు రోడ్డుకు శంకుస్థాపన
అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం- ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు
దాచేపల్లి, ఆంధ్రప్రభ: అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. గురువారం దాచేపల్లి–నడికుడి మున్సిపాలిటీ పరిధిలోని ఇరికేపల్లి గ్రామంలో రూ.1.02 కోట్ల వ్యయంతో నిర్మించనున్న తారు రహదారికి ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. గురజాల నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గతంలో ఇరికేపల్లి గ్రామంలోని పలు వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు గుర్తు చేశారు. దాచేపల్లి నుంచి ఇరికేపల్లి వరకు ప్రధాన రహదారి నిర్మాణానికి ఇప్పటికే నిధులు మంజూరయ్యాయని, పనులను త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై రూపొందించిన కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేసి ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అలాగే స్థానికుడు పట్రా ఆనందరావు నివాసానికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తదనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆర్డీవో మురళీకృష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించి పలు సమస్యలను పరిష్కరించారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నర్రా పుల్లయ్య, సొసైటీ నారాయణ, జక్కిశెట్టి పున్నారావు, ఈద నరసింహారెడ్డి, తవ్వ శ్రీనివాసరావు, పట్రా విజయ్‌కుమార్, కందుకూరు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
