‘మచిలీపట్నం’ పేరుతో యుద్ధ నౌక నిర్మాణం గర్వకారణం

  • రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ‘గేట్‌వే ఆఫ్ అమరావతి’గా అభివృద్ధి చెందుతున్న మచిలీపట్నం పోర్టు పేరుతో కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ భారీ జలాంతర్గామి విధ్వంసక యుద్ధ నౌకను నిర్మించడం హర్షణీయమని రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

భారత నౌకాదళం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఎనిమిది జలాంతర్గామి విధ్వంసక యుద్ధ నౌకల్లో ఒకదానికి మచిలీపట్నం పేరు పెట్టడం బందరు ప్రజలకు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

ఈ యుద్ధ నౌకను తూర్పు తీరంలో సముద్ర అంతర్భాగంలో నిఘా నిర్వహించేందుకు, జలాంతర్గాములను గుర్తించి విధ్వంసం చేయడంతో పాటు తక్కువ శ్రేణి సముద్ర రక్షణ కార్యకలాపాల్లో వినియోగించనున్నట్లు తెలిపారు.

మచిలీపట్నం పేరును జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకొచ్చేలా ఈ భారీ యుద్ధ నౌక నిర్మాణం జరగడం బందరు ప్రజలకు దక్కిన విశేష గౌరవమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.