గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రామాయణం’ ట్రైలర్
రామ-రావణ యుద్ధాన్ని ఆవిష్కరించిన మేకర్స్
భారీ విజువల్స్, స్టార్ తారాగణంతో ఆకట్టుకున్న తొలి చూపు
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణం’ చిత్రం తొలి ట్రైలర్ విడుదలైంది. దర్శకుడు నితేశ్ తివారీ రూపొందిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారం ఉదయం 4:15 గంటలకు విడుదల చేశారు. “ఇక్కడి నుంచే మహాకావ్యం ప్రారంభమవుతోంది” అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ ట్రైలర్లో అయోధ్య వైభవం, అరణ్యవాసం, లంక నగరం, రామ-రావణ యుద్ధాన్ని అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్‌తో ఆవిష్కరించారు. కథను పూర్తిగా వెల్లడించకుండా ఆసక్తిని పెంచేలా ట్రైలర్‌ను రూపొందించారు.
ట్రైలర్లో రావణుడిగా యష్, శ్రీరాముడిగా రణబీర్ కపూర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సీత పాత్రలో సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే కనిపించగా, రామ-రావణుల మధ్య జరిగే ధర్మ-అధర్మ పోరాటాన్ని ప్రభావవంతంగా చూపించారు. ఆస్కార్ విజేతలు హాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌కు మరింత బలం చేకూర్చగా, డీఎన్ఈజీ రూపొందించిన విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయి నాణ్యతను గుర్తు చేస్తున్నాయి.
ఈ చిత్రంలో హనుమంతుడిగా సన్నీ డియోల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, మండోదరిగా కాజల్ అగర్వాల్, దశరథుడిగా అరుణ్ గోవిల్‌తో పాటు పలువురు ప్రముఖులు నటిస్తున్నారు. జటాయువు పాత్రకు అనుపమ్ ఖేర్ గాత్రదానం చేశారు. దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం భారతీయ పురాణ గాథను ప్రపంచ స్థాయి సాంకేతికతతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
