రోడ్డు ప్రమాదాల నివారణకు కర్నూలులో బ్లాక్ స్పాట్స్ పరిశీలన.

రోడ్డు ప్రమాదాల నివారణకు కర్నూలులో బ్లాక్ స్పాట్స్ పరిశీలన.

పంచలింగాల టోల్‌గేట్ వద్ద కలెక్టర్, ఎస్పీ తనిఖీలు.
అప్రమత్తమైతేనే ప్రమాదాల నియంత్రణ :
అధికారులకు కలెక్టర్ సూచనలు.
బ్లాక్ స్పాట్స్‌పై ప్రత్యేక దృష్టి..
అధికారులకు దిశానిర్దేశం.
హైవేపై ప్రమాదాల అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు.
పంచలింగాల టోల్‌గేట్ వద్ద బ్లాక్ స్పాట్స్ పరిశీలన.
రోడ్డు ప్రమాదాల నివారణపై కలెక్టర్ డా. ఏ. సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రత్యేక దృష్టి.

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జాతీయ రహదారులపై తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కర్నూలు సమీపంలోని పంచలింగాల టోల్‌గేట్ వద్ద బ్లాక్ స్పాట్స్ పరిశీలన యాత్రను జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పంచలింగాల టోల్‌గేట్ పరిసరాల్లో ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్ ప్రాంతాలను కలెక్టర్, ఎస్పీ స్వయంగా పరిశీలించారు. రోడ్డు భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెచ్చరిక బోర్డులు, వేగ నియంత్రణ చర్యలు, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలపై పోలీసు, హైవే అధికారులకు పలు సూచనలు చేశారు.

ప్రమాదాల నివారణపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు

రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి వెంటనే భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా. ఏ. సిరి ఆదేశించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ సిగ్నల్స్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. ప్రమాదాలకు కారణమవుతున్న అంశాలను గుర్తించి సమన్వయంతో పని చేస్తేనే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు.

బస్సులో ప్రయాణిస్తూ ప్రత్యక్ష పరిశీలన

అనంతరం కలెక్టర్, ఎస్పీ బ్లాక్ స్పాట్స్ పరిశీలన యాత్ర బస్సులో బయలుదేరి ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. రహదారుల పరిస్థితి, మలుపులు, సిగ్నలింగ్ వ్యవస్థ, వాహనాల రాకపోకలు, ప్రమాదాల తీవ్రత వంటి అంశాలను అధ్యయనం చేస్తూ అధికారులకు తక్షణ చర్యలపై దిశానిర్దేశం చేశారు.

రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన

జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించేందుకు కేవలం పోలీసు శాఖ మాత్రమే కాకుండా హైవే అధికారులు, రవాణా శాఖ, ప్రజలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలను కూడా మరింత విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.