ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చేందుకు కృషి
ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చేందుకు కృషి
- ప్రతి ఇంటి వారు బాధ్యతగా మెలగాలి
- జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: ప్లాస్టిక్ రహిత జిల్లాగా పశ్చిమగోదావరిని తీర్చిదిద్దేందుకు సమిష్టి కృషి అవసరమని కలెక్టర్ చదవాడ నాగరాణి సూచించారు. పర్యావరణ, ప్రజారోగ్య సంరక్షణ దృష్ట్యా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా విడనాడి జిల్లాను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు జిల్లా ప్రజలు బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తున్న స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా “ప్లాస్టిక్ రహిత రాష్ట్రం” అనే ఇతివృత్తంతో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ బహిష్కరణ, పర్యావరణహిత వస్తువుల వినియోగంపై అవగాహన కార్యక్రమం భీమవరం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆనంద ఇన్ సమావేశ హాలులో నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాను ప్లాస్టిక్ రహితంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని అన్నారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేసి పర్యావరణ పరిరక్షణపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. విద్యార్థుల ద్వారా కుటుంబాలకు, సమాజానికి చైతన్యం చేరుతుందని పేర్కొన్నారు. ప్రతి వార్డులో కేటాయించిన ప్రదేశాల్లోనే చెత్త వేయాలని, కాలువలు, రహదారుల పక్కన చెత్త పారవేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. వ్యాపార సంస్థలు తమ దుకాణాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, దుకాణాల ఎదుట చెత్త ఉంటే యజమానులనే బాధ్యులుగా పరిగణిస్తామని హెచ్చరించారు.
ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై వ్యాపారులకు అవగాహన కల్పించి, నిషేధిత ప్లాస్టిక్ విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్లాస్టిక్ విక్రయం మాత్రమే కాకుండా వినియోగంపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, చిన్న వ్యాపారులు బయోడిగ్రేడబుల్ వస్తువులు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, వీధుల్లో వ్యర్థాలను బహిరంగంగా వేయకుండా పర్యవేక్షణ పెంచాలని అన్నారు. గుడ్డ సంచులు, కాగితం సంచుల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. ప్రజలు ఇంటి వద్దనే తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని కోరారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత అని, కళాశాలల నుంచి చాంబర్ ఆఫ్ కామర్స్ వరకు అన్ని వర్గాలు ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వార్డుల వారీగా ప్రణాళికలు రూపొందించి ప్లాస్టిక్ నివారణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యార్థులతో సమన్వయం చేసుకొని ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. నిషేధిత ప్లాస్టిక్ నిల్వలు, విక్రయాలపై దాడులు నిర్వహించి జరిమానాలు విధించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో భీమవరం రెవెన్యూ డివిజనల్ అధికారి, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ఎ.రాంబాబు, బీసీ వెల్ఫేర్ అధికారి ఏవి సూరిబాబు, పబ్లిక్ హెల్త్ అధికారి సోమశేఖర్, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి చెరుకువాడ రంగస్వామి, స్వర్ణ వార్డు సిబ్బంది, మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది, మెప్మా సభ్యులు, శానిటేషన్ సెక్రటరీలు, తదితరులు పాల్గొన్నారు.
