జొన్నగిరి పర్యటన ముగించుకుని తుంగభద్రకు సీఎం చంద్రబాబు
జొన్నగిరి పర్యటన ముగించుకుని తుంగభద్రకు సీఎం చంద్రబాబు
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్టు కార్యక్రమాలను పూర్తి చేసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం తుంగభద్ర జలాశయానికి బయలుదేరారు. పత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరిలో ఉన్న జియో మైసూర్ గోల్డ్ మైన్ ప్లాంట్ హెలిప్యాడ్ నుంచి ఉదయం 9.25 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో కర్ణాటక రాష్ట్రంలోని మునిరాబాద్ సమీప తుంగభద్ర ప్రాజెక్టుకు ప్రయాణమయ్యారు.
ఇటీవల దెబ్బతిన్న తుంగభద్ర జలాశయ గేట్ల స్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు రాయలసీమతో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సాగునీటి అవసరాలకు కీలక ఆధారంగా నిలుస్తుండటంతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.
జొన్నగిరి హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, ఉమ్మడి గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, జియో మైసూర్ సంస్థ ఎండీ ప్రభాకరన్, డైరెక్టర్ కార్తికేయన్, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, పత్తికొండ ఆర్డీఓ ఓబులేసు తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు వీడ్కోలు పలికారు.
జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రారంభోత్సవం అనంతరం తుంగభద్ర ప్రాజెక్టు కార్యక్రమానికి ముఖ్యమంత్రి బయలుదేరడం జిల్లాలో ప్రాధాన్యత సంతరించుకుంది. తుంగభద్ర గేట్ల పునరుద్ధరణతో రాయలసీమ సాగునీటి భద్రత మరింత బలోపేతం అవుతుందని రైతాంగం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
