ఉపాధ్యాయులుగా మారిన ఎస్పీ నరసింహ..
సూర్యాపేట, ఆంధ్రప్రభ : నేరాల నియంత్రణకై సమీక్షలు బిజీ బిజీ కార్యక్రమాలతో ఉండే జిల్లా ఎస్పీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను చూడగానే రిలాక్స్ అయ్యారు. పాఠశాల వసతులు, సమస్యలపై ఆరా తీసిన అనంతరం తన పూర్వపు వృత్తిని గుర్తు చేసుకుంటూ.. విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఉత్తరధ్రువం.. దక్షిణధ్రువం.. అంటూ సాంఘికశాస్త్రం పాఠాలను ఎనిమిదోవ తరగతి విద్యార్థులకు చెప్పారు .
జూనియర్ అసిస్టెంట్ కు సన్మానం
తాను పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలనందే తన కుమారుడు రుత్విక్ ను చేర్పించిన జూనియర్ అసిస్టెంట్ హరితను అభినందించి సన్మానించారు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విద్యను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన అనుభవిజ్ఞులైన నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉంటారన్నారు. పిల్లలకు అర్థమయ్యే రీతిలో సృజనాత్మకతతో కూడిన విద్యను అందిస్తారని తెలిపారు. కావున తల్లిదండ్రులు విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడం కోసం ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని సూచించారు.
కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి
విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని ఎస్పి ఆకాంక్షించారు. చెడు అలవాటులకు దూరంగా ఉండాలని మంచి స్నేహితులను మంచి పుస్తకాలను ఎంచుకొని కష్టపడి చదువుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులు నైపుణ్యంతో విద్యార్థులకు పాఠాలు బోధించాలని సర్కారు బడుల ప్రాముఖ్యతను సామర్థ్యాన్ని తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్, పట్టణ సిఐ వెంకటయ్య, ఎస్ఐలు ఏడుకొండలు, సాయిరాం, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.
