బ్రాహ్మణ వెల్లెంలతో నల్లగొండ సస్యశ్యామలం…

బ్రాహ్మణ వెల్లెంలతో నల్లగొండ సస్యశ్యామలం…
- అప్పాజీపేటలో బైక్ పై సాగునీటి కాలువలు పరిశీలించిన
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ : బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుతోనే నల్లగొండ నియోజకవర్గంతో పాటు మునుగోడు, నకిరేకల్ , తుంగతుర్తి నియోజకవర్గంలోని భూములన్ని సస్యశ్యామలం అవుతాయని తద్వారా లక్ష ఎకరాలకు సాగునీరందుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ మండలం అప్పాజిపేటలో స్వయంగా ద్విచక్ర వాహనం నడుపుతూ సాగునీటి కాల్వలు పరిశీలించి నూతనంగా ఏర్పాటు చేస్తే పిల్ల కాల్వకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2007లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఒప్పించి ఈ ప్రాజెక్టు తీసుకొచ్చానని ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించడమే కాకుండా ఫ్లోరిన్ సమస్య నుండి విముక్తి లభిస్తుందన్నారు. త్వరలో పిల్ల కాలువలు సైతం పూర్తి చేస్తామని, ఈ ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తయితే నల్లగొండ నియోజకవర్గంలో 13 గ్రామాల్లో 30 వేల ఎకరాల ఎకరాలకు సాగునీరు అందుతుందని, అప్పాజీపేటలో దాదాపు 4 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, గ్రామంలో చెరువులు, కుంటల రక్షణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రెండు నెలల్లో చిట్యాల వరకు రోడ్డు పూర్తవుతుందని, ఎల్లారెడ్డి గూడెం, కల్వలపల్లి రోడ్లు టెండర్ దశలో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఆర్డీవో అశోక్ రెడ్డి, తహశీల్దార్ కె. పరుశ రామ్, స్థానిక సర్పంచ్ గంగుల అండాలు సైదులు యాదవ్, ఉప సర్పంచ్ సతీష్, నాయకులు రాపర్తి సతీష్, కరుణాకర్ , కాసర్ల బిక్షం, అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు, రైతులు, ప్రాజెక్టు అధికారులు, వార్డు మెంబర్లు, అభిమానులు పాల్గొన్నారు.
