మోదీకి సీఎం విజయ్ లేఖ

  • గోదావరి–కావేరి–గుండార్ అనుసంధానాన్ని వేగవంతం చేయాలని విజ్ఞప్తి..
  • జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి..
  • దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనమని వెల్లడి

చెన్నై, ఆంధ్రప్రభ : నీటి కొరతను శాశ్వతంగా అధిగమించేందుకు గోదావరి–కావేరి–గుండార్ నదుల అనుసంధాన ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యంతో చేపట్టాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, వేగవంతంగా అమలు చేయాలని కోరారు.

తమిళనాడు సహజంగానే నీటి కొరత ఉన్న రాష్ట్రం అని, రాష్ట్ర అవసరాల్లో 30 శాతానికి పైగా నీటి కోసం పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోందని విజయ్ లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా పుదుక్కోట్టై, శివగంగై, రామనాథపురం, విరుదునగర్ జిల్లాలు తీవ్ర కరవు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని తెలిపారు.

గోదావరిలో సముద్రంలో కలిసిపోతున్న వరద మిగులు జలాలను కావేరి, వైగై, గుండార్ నదులకు మళ్లించడం ద్వారా తాగునీరు, సాగునీటి సమస్యలను దీర్ఘకాలికంగా పరిష్కరించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) గోదావరి–పెన్నార్–పాలార్–వెల్లార్ అనుసంధానానికి తొలి దశ డీపీఆర్ సిద్ధం చేసిందని, ఈ ప్రాజెక్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూర్చేలా రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ప్రతిపాదించిన మార్గం కావేరి నదికి కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ముగుస్తోందని, దానిని గుండార్ వరకు విస్తరించే పూర్తి ప్రాజెక్టును అమలు చేయాలని కోరారు.

రాష్ట్రాల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను పరస్పర సంప్రదింపులు, సహకార సమాఖ్య స్ఫూర్తితో పరిష్కరించవచ్చని విజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, లబ్ధి పొందే రాష్ట్రాల భాగస్వామ్యంతో ప్రత్యేక ప్రయోజన సంస్థ (ఎస్‌పీవీ) ఏర్పాటు చేసి, ప్రాజెక్టుకు నిధులు, సమన్వయం కల్పించాలని సూచించారు.

జలశక్తి మంత్రిత్వ శాఖ, జాతీయ జల అభివృద్ధి సంస్థ రాష్ట్రాలతో చర్చలను వేగవంతం చేసి, కట్టలై బ్యారేజ్ వరకు డీపీఆర్‌ను ఖరారు చేయాలని, ప్రాజెక్టును జాతీయ ప్రాధాన్య ప్రాజెక్టుగా ప్రకటించి త్వరితగతిన అమలు చేయాలని ప్రధాని మోదీని సీఎం విజయ్ కోరారు.