అల‌ర్ట్ ! ఈ ప్రాంతాల్లో రాత్రి వరకు వర్షం…

హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణలో మరోసారి వర్షాలు కురిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్ నగరంలోనూ సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య అక్కడక్కడా జల్లులు కురిసే అవకాశం ఉంద‌ని.. పలు ప్రాంతాల్లో రాత్రి వ‌ర‌కు కూడా వర్షాలు కొనసాగే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.

సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలతో పాటు కామారెడ్డి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తాజా అంచనాలు సూచిస్తున్నాయి. మధ్యాహ్నం తర్వాత వర్షాల తీవ్రత పెరిగి రాత్రి వరకు కొనసాగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.

గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల మాదిరిగానే హైదరాబాద్‌లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. లోత‌ట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచే అవకాశం ఉన్నందున అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.