నెల్లూరులో రాత్రి వేళ ప్రత్యేక పోలీసు నిఘా
అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు ఎస్టీఎఫ్ బృందాలతో తనిఖీలు
నెల్లూరు, ఆంధ్రప్రభ: నెల్లూరు నగరంలో రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రత్యేక ఎస్టీఎఫ్ బృందాలతో నగరంలోని కీలక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నిఘా నిర్వహిస్తున్నారు.
ఈ తనిఖీల్లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న వాహనదారులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వ్యక్తులు, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేకంగా తనిఖీలు చేపడుతున్నారు. అలాగే నగరంలోని లాడ్జీలు, గెస్ట్ హౌస్‌లలో తనిఖీలు నిర్వహిస్తూ అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచుతున్నారు.
ప్రజల భద్రతకు భంగం కలిగించే కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టం చేశారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రజలు చట్టాలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే సమాచారం అందించాలని జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.
