Rs-179-crore : మ‌గ్గం ఇళ్ళ‌కు బాబు..Andhra Prabha Top Story

Rs-179-crore : మ‌గ్గం ఇళ్ళ‌కు బాబు..Andhra Prabha Top Story

  • నేత‌న్న సేవ‌లో కూట‌మి స‌ర్కారు
  • 71,536 చేనేత కుటుంబాలకు ల‌బ్ధి
  • ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు
  • రూ.179 కోట్లతో ఊర‌ట
  • జాతీయ చేనేత దినోత్సవం రోజున
  • చీరాలలో నిధులు విడుదల‌
  • నేతన్న కుటుంబాలతో సీఎం ముఖాముఖి

(ఆంధ్ర‌ప్ర‌భ‌, అమరావతి)

Rs-179-crore : నేతన్నల కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇప్పటికే ఉచిత విద్యుత్, రాయితీలు, 50 ఏళ్లకే పింఛన్ అందిస్తూ దన్నుగా ఉంటోన్న ప్రభుత్వం. తాజాగా నేత‌న్న‌ సంక్షేమానికి మరో అడుగు ముందుకేసింది. నేతన్న సేవలో పథకం కింద ఒక్కో చేనేత కుటుంబానికి రూ.25 వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. 7వ తేదీన ‘12వ జాతీయ చేనేత దినోత్సవం’ను పురస్కరించుకుని ‘నేతన్న సేవలో’ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ పథకంలో భాగంగా అర్హత కలిగిన ప్రతి నేతన్న కుటుంబానికి రూ.25 వేల సాయం దక్కనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 71,536 కుటుంబాలకు రూ.179 కోట్లను ప్రభుత్వం అందించనుంది. మేనిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా చేనేతల సంక్షేమాన్ని, వృత్తి వారసత్వాన్ని పరిరక్షించే లక్ష్యంతో సర్కారు సాయం అందిస్తోంది.

Rs-179-crore : బలోపేతం దిశగా

తాజాగా ప్రవేశపెడుతోన్న నేతన్న సేవలో పథకమే కాకుండా ఇప్పటికే అనేక విధాలుగా ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోంది. చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌కు 500 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తోంది. దీంతో 62,541 చేనేత కుటుంబాలు, 10,032 పవర్‌లూమ్ యూనిట్లకు ప్రయోజనం కల్పిస్తోంది. దీనికి ఏటా రూ.150 కోట్లు ఖర్చు కానుంది. అంతేకాకుండా 50 ఏళ్లు నిండిన 85 వేల మంది చేనేతలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.420 కోట్లు ఖర్చు చేస్తోంది. 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్‌ ద్వారా రూ.79 కోట్లు అందించింది. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్కుతో పాటు అమరావతిలోని శాఖమూరులో చేనేత, హస్తకళల మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తోంది. విశాఖపట్నంలో రూ.4,200 కోట్ల పెట్టుబడితో సుస్థిర టెక్స్‌టైల్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు కానుంది.

Rs-179-crore : చీరాలో నేత‌న్న‌ల‌తో సీబీఎన్ …..

చీరాల నియోజకవర్గంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి వేటపాలెం మండలం కొత్తపేట గ్రామానికి 10.50 గంటలకు చేరుకుంటారు. 11.05 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 01.35 గంటలకు జాండ్రపేటలో చేనేతల వర్క్‌షాప్‌లో లబ్ధిదారులతో ముఖాముఖి అవుతారు. కొత్తపేటలో 04.10 గంటలకు టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 04.45 గంటలకు సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.