విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకులు ఉపాధ్యాయులే

  • ఉద్యోగ ధర్మంతో పాటు సామాజిక ధర్మాన్ని నిర్వర్తించాలి
  • ఏపీ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాలకోటయ్య

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ: విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులే మార్గదర్శకులని ఏపీ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య అన్నారు. ఉద్యోగ ధర్మంతో పాటు సామాజిక ధర్మాన్ని కూడా పవిత్రంగా నిర్వర్తించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్రలో భాగంగా గురువారం జిల్లాలోని పెద్దపాడు బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు.

సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, గురుకుల ప్రిన్సిపాల్స్, హాస్టల్ వెల్ఫేర్ అధికారులతో గురువారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో జవాబుదారీ పరిపాలన ఎంతో ముఖ్యమని, అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా, చెడ్డ పేరు రావాలన్నా అది అధికారుల పనితీరుపైనే ఆధారపడి ఉంటుందన్నారు. మంచి పని చేస్తే పాస్ మార్కులు, తప్పు చేస్తే ఫెయిల్ మార్కులు వస్తాయని స్పష్టం చేశారు.

ప్రస్తుతం సాంకేతిక యుగంలో కార్యాలయాల్లో జరిగే ప్రతి అంశం క్షణాల్లో ఉన్నతాధికారుల దృష్టికి చేరుతుందని హెచ్చరించారు.అనంతరం తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాటా మంతీ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల సమస్యలు, విద్యాభ్యాసం, వసతి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు కలిపి పెట్టిన అన్నం ముద్దలను ఆయన స్వీకరించి భుజించారు. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కె. వినాయకం, జిల్లా కో-ఆర్డినేటర్ యశోద లక్ష్మి, ప్రిన్సిపాల్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అరసవిల్లిలోని సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.