టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
హైదరాబాద్, ఆంధ్రప్రభ: పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మేధావుల భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు టీపీసీసీ మేధావుల విభాగం కార్యాచరణను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ మేధావుల విభాగం రాష్ట్ర కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించారు.
మేధావుల విభాగం రాష్ట్ర చైర్మన్ ఆనంతుల శ్యామ్ మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే ఆల్ ఇండియా కాంగ్రెస్ ఇంటెలెక్చువల్ సెల్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ దావల్, వైస్ చైర్మన్ పుష్ప లక్ష్మణ్, పలువురు రాష్ట్ర నాయకులు, మేధావుల విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.
సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడం, మేధావుల విభాగాన్ని గ్రామ స్థాయి వరకు విస్తరించడం, భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడంలో మేధావుల పాత్రను మరింత పెంచాలని నాయకులు అభిప్రాయపడ్డారు. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా మేధావులతో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు.
రాష్ట్రవ్యాప్తంగా మేధావులు, విద్యావేత్తలు, వివిధ రంగాల నిపుణులను కాంగ్రెస్ పార్టీతో అనుసంధానం చేస్తూ సంస్థను మరింత బలోపేతం చేయడంపై సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. భవిష్యత్‌లో ప్రజలకు మరింత చేరువయ్యే కార్యక్రమాలను చేపట్టాలని నాయకులు నిర్ణయించారు.
