ఒడిశా నైనీ గని బొగ్గుతో తెలంగాణకు తొలి రైలు

9 ఏళ్ల నిరీక్షణకు తెర.. నైనీ బొగ్గుతో తెలంగాణ ఇంధన భద్రతకు బలం
ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ నుంచి 4 వేల టన్నుల జీ-10 గ్రేడ్ బొగ్గుతో తొలి రైలు సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌కు చేరిక..
ఇది తెలంగాణ ఇంధన భద్రతకు చారిత్రక మైలురాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్య

హైదరాబాద్/మంచిర్యాల, ఆంధ్రప్రభ: సింగరేణి చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ నుంచి వెలికితీసిన బొగ్గుతో కూడిన తొలి రైల్వే రేక్ విజయవంతంగా తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జైపూర్‌లో ఉన్న సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్‌టీపీపీ)కు చేరుకుంది. దాదాపు 1,131 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన 59 వ్యాగన్లలో 4 వేల టన్నుల అత్యుత్తమ జీ-10 గ్రేడ్ బొగ్గు రావడం సింగరేణి చరిత్రలో చారిత్రక మైలురాయిగా అధికారులు పేర్కొన్నారు.

ఎస్‌టీపీపీ ప్రాంగణానికి చేరుకున్న తొలి బొగ్గు రైల్వే రేక్‌కు సంస్థ డైరెక్టర్లు ఎల్.వి. సూర్యనారాయణ, ఎం. తిరుమలరావు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సింగరేణి అధికారులు, ఉద్యోగులు, కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ చారిత్రక సందర్భంగా వీడియో సందేశం ద్వారా స్పందించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గత తొమ్మిదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైన నైనీ కోల్ బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తిని ప్రజా ప్రభుత్వం సాకారం చేయడం గర్వకారణమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒడిశా ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని ఈ లక్ష్యాన్ని విజయవంతంగా సాధించామని చెప్పారు.

నైనీ కోల్ బ్లాక్ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రావడం తెలంగాణ ఇంధన భద్రతకు బలమైన పునాది వేస్తుందని భట్టి పేర్కొన్నారు. రాబోయే దశాబ్దాల పాటు రాష్ట్రానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

సింగరేణి ఇప్పటికే రాష్ట్ర అవసరాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా బొగ్గు సరఫరా చేస్తోందని, జెన్‌కోతో పాటు సింగరేణి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ ఉత్పత్తిలోనూ కీలక పాత్ర పోషిస్తోందని గుర్తు చేశారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా కొత్త బొగ్గు బ్లాకులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

ఇప్పటికే తాడిచర్ల-2 కోల్ బ్లాక్ను సింగరేణి దక్కించుకుందని, తాజాగా మనుగూరు బ్లాక్ను కూడా వేలం ద్వారా సొంతం చేసుకుందని భట్టి వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని బొగ్గు బ్లాకులను పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

సింగరేణి కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా, రాబోయే రోజుల్లో క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ తవ్వకాల రంగంలోకి కూడా అడుగుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచస్థాయి మైనింగ్ సంస్థలతో పోటీపడేలా అత్యాధునిక సాంకేతికత, ఆధునిక మైనింగ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

నైనీ కోల్ బ్లాక్ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ తెలంగాణకు చేరడం సింగరేణి అభివృద్ధి ప్రయాణంలో కొత్త అధ్యాయానికి నాంది అని, ఈ విజయానికి కృషి చేసిన అధికారులు, ఇంజినీర్లు, కార్మికులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందించారు.