సుప్రీంకోర్టు న్యాయమూర్తి పేరుతో భారీ సైబర్ మోసం

  • ఢిల్లీ పోలీస్, ఈడీ అధికారులమంటూ నమ్మించి టోకరా
  • ‘కోర్టుకు డబ్బు ప్లెడ్జ్ చేయాలి’ అంటూ మోసం..
  • కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

మచిలీపట్నం, ఆంధ్రప్రభ: కృష్ణా జిల్లాలో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. ఢిల్లీ పోలీస్, ఈడీ అధికారులు, సుప్రీంకోర్టు పేర్లను ఉపయోగించి ఓ మహిళను భయభ్రాంతులకు గురిచేసిన సైబర్ నేరగాళ్లు ఆమె నుంచి రూ.1.43 కోట్లకు పైగా కాజేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

పోలీసుల వివరాల ప్రకారం.. మచిలీపట్నంలోని పరాస్‌పేటకు చెందిన వెంపటి అలవేలు మంగమ్మకు జూన్ 10న గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది. ఆమె పేరుతో మనీ లాండరింగ్ కేసు నమోదైందని, ఢిల్లీలోని కెనరా బ్యాంకు ఖాతా ద్వారా అక్రమ లావాదేవీలు జరిగాయని, ఆమెపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయిందని నమ్మించారు.

తర్వాత వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని చెబుతూ, న్యాయమూర్తి పేరును ఉపయోగించి నకిలీ విచారణ నిర్వహించినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. కేసు నుంచి బయటపడాలంటే తన బ్యాంకు ఖాతాల్లోని నగదును తాత్కాలికంగా “కోర్టుకు ప్లెడ్జ్” చేయాలని, మూడు రోజుల్లో తిరిగి చెల్లిస్తామని మోసగాళ్లు నమ్మించారు.

వారి సూచనల మేరకు బాధితురాలు జూన్ 15 నుంచి విడతల వారీగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎల్‌ఐసీ కో-ఆపరేటివ్ బ్యాంక్‌లలోని డిపాజిట్లను రద్దు చేసి, ఆర్‌టీజీఎస్ ద్వారా మొత్తం రూ.1,43,50,000ను వారు సూచించిన బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు.

అనంతరం జూలై చివర్లో మరో రూ.95 లక్షలు చెల్లించాలని, లేనిపక్షంలో ఆమె ఆస్తులన్నింటినీ సీజ్ చేస్తామని బెదిరించడంతో బాధితురాలికి అనుమానం వచ్చింది. వెంటనే అమెరికాలో ఉన్న తన కుమారుడికి విషయం చెప్పగా, ఇది సైబర్ మోసమని గుర్తించారు. అనంతరం స్నేహితుల సహాయంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

మోసగాళ్లు మొత్తం వ్యవహారంలో వాట్సాప్ వీడియో కాల్స్, ఐఎంఓ యాప్ ద్వారానే మాట్లాడారని, ఎప్పుడూ తమ ముఖాలు చూపించలేదని బాధితురాలు తెలిపింది. విషయం బయటకు చెబితే కుటుంబ సభ్యులను చంపేస్తామని కూడా బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పర్యవేక్షణలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. పోలీసులు, సీబీఐ, ఈడీ, కోర్టులు లేదా ఇతర ప్రభుత్వ సంస్థల పేరుతో ఎవరైనా ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేస్తే నమ్మవద్దని సూచించారు. అలాంటి కాల్స్ వస్తే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని, సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు..