హనుమకొండ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం.. !
- చనిపోయిన వ్యక్తికి వెంటిలేటర్ పై ఉంచి బిల్లులు వసూలు?
- ఆసుపత్రి ఎదుట ధర్నా.. విచారణకు డిమాండ్
హనుమకొండ, ఆంధ్రప్రభ : హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి మరణానికి సంబంధించిన వ్యవహారం వివాదాస్పదంగా మారింది. రోగి బ్రెయిన్ డెత్ అయిన తర్వాత కూడా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స కొనసాగించినట్లు చూపుతూ బిల్లులు వసూలు చేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఏం జరిగింది?
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామానికి చెందిన పంజాల శ్రీధర్ (32) బ్రెయిన్ క్లాట్ సమస్యతో అస్వస్థతకు గురయ్యాడు. మొదట స్థానిక వైద్యుడి సూచన మేరకు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా, అనంతరం మెరుగైన చికిత్స కోసం హనుమకొండలోని మరో న్యూరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు మెదడు శస్త్రచికిత్స నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
శస్త్రచికిత్స అనంతరం రెండు రోజులైనా రోగి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని, పలుమార్లు అడిగినా వైద్యులు సరైన సమాధానం చెప్పలేదని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇదే సమయంలో ఆరోగ్యశ్రీ ప్రక్రియ కొనసాగుతుండగానే రూ.70 వేల వరకు నగదు చెల్లించాలని కోరినట్లు కూడా వారు తెలిపారు.
బంధువుల ఆరోపణలివే…
మృతుడికి అప్పటికే బ్రెయిన్ డెత్ సంభవించి ఉండొచ్చని తమకు అనుమానం వచ్చిందని, అయినప్పటికీ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స కొనసాగుతున్నట్లు చూపించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బిల్లుల చెల్లింపుపై ఒత్తిడి తెచ్చారని, పూర్తి మొత్తం చెల్లించే వరకు మృతదేహం అప్పగించబోమని చెప్పారని కూడా కుటుంబ సభ్యులు వాపోయారు. అయితే, ఈ ఆరోపణలపై ఆసుపత్రి యాజమాన్యం స్పందన ఇంకా వెలువడాల్సి ఉంది. అలాగే రోగికి ఎప్పుడు బ్రెయిన్ డెత్ సంభవించింది, చికిత్స విధానం వైద్య ప్రమాణాలకు అనుగుణంగానే జరిగిందా లేదా అన్నది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది.
ఆసుపత్రి ఎదుట ఆందోళన
ఈ ఘటనతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించి, వైద్యుల తీరుపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న హనుమకొండ పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎస్‌ఐ మచ్చ శివకుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేసి, ఇరు వర్గాలతో చర్చలు జరిపారు.
విచారణకు డిమాండ్
ఈ ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సంబంధిత ప్రభుత్వ విభాగాలు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆరోపణల్లో నిజానిజాలు తేలిన అనంతరం బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
