మహిళా హోంగార్డు ఆరోపణలు నిరాధారం.. కృష్ణా జిల్లా ఎస్పీ కార్యాలయం
- వాస్తవాలను వెల్లడించిన జిల్లా పోలీసు యంత్రాంగం
- తప్పుడు ప్రచారంపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక
మచిలీపట్నం, ఆంధ్రప్రభ: మహిళా హోంగార్డు రూపకళ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కృష్ణా జిల్లా ఎస్పీ కార్యాలయం స్పష్టం చేసింది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో ఆమె నియామకం, విధులు, సస్పెన్షన్‌కు దారితీసిన పరిస్థితులపై వివరణ ఇచ్చింది.
కారుణ్య నియామకం కింద రూపకళను సి-కేటగిరీ హోంగార్డుగా నియమించామని, ఈ కేటగిరీ సిబ్బంది గార్డెనింగ్, టైలరింగ్, శానిటేషన్ తదితర విధులతో పాటు జిల్లా పోలీసు కార్యాలయం ఆధ్వర్యంలో అప్పగించే పనులు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే ఆమె గత నాలుగేళ్లుగా ఎలాంటి బదిలీ లేకుండానే పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తోందని తెలిపింది.
ఆమెను ఎప్పుడూ ఏ పోలీసు అధికారి ఇంటి పనులకు నియమించలేదని ఎస్పీ కార్యాలయం స్పష్టం చేసింది. హోంగార్డు శిక్షణ కోసం హెడ్‌క్వార్టర్స్‌కు హాజరు కావాలని ఆదేశించినప్పటికీ, ఆమె పూర్తిస్థాయిలో సహకరించలేదని పేర్కొంది. విధులకు సక్రమంగా హాజరు కాకపోవడం, ఉన్నతాధికారులు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించకపోవడం, తనకు అనుకూలంగా మాత్రమే విధులకు వస్తానని చెప్పడం వంటి అంశాలు అధికారుల దృష్టికి వచ్చాయని వెల్లడించింది.
తనకు నచ్చిన చోటే పోస్టింగ్ ఇవ్వాలని వివిధ మార్గాల్లో అధికారులపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించిందని, వ్యక్తిగత సమస్యలు ఉంటే రాతపూర్వకంగా తెలియజేయాలని సూచించినప్పటికీ స్పందించలేదని పేర్కొంది. విధులకు తరచూ గైర్హాజరవుతున్నట్లు అందిన నివేదికల ఆధారంగా శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఈ నెల 3న ఆమెను సస్పెండ్ చేసినట్లు తెలిపింది.
గతంలో కూడా ఒకే పోలీస్‌స్టేషన్‌లో కొనసాగాలని పట్టుబట్టడం, బదిలీని నిరాకరించడం, ప్రశ్నించిన అధికారులపై అసత్య ప్రచారం చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఎస్పీ కార్యాలయం ఆరోపించింది. జిల్లా ఎస్పీతో పాటు ఇతర ఉన్నతాధికారులపై నిరాధార ఆరోపణలు చేస్తూ పోలీసు వ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఇలాంటి చర్యలను బ్లాక్‌మెయిల్‌గా పరిగణిస్తూ శాఖాపరమైన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.
అవాస్తవ ప్రచారాన్ని నమ్మకుండా, వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాతే ప్రచురించాలని మీడియాకు విజ్ఞప్తి చేసింది. నిరాధార ఆరోపణలను ధృవీకరణ లేకుండా ప్రచారం చేసే వారిపై అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ కార్యాలయం హెచ్చరించింది.
