ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యాలే లక్ష్యం..
- అభివృద్ధి పనులపై ఈవో, చైర్మన్ క్షేత్రస్థాయి సమీక్ష
- కొండపై అభివృద్ధి పనులను పరిశీలించిన ఈవో, చైర్మన్
- కాలిబాట, క్యూలైన్లు, ప్రసాదం పోటు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశం
- నూతన ప్రసాదం పోటు, అన్నప్రసాద భవన నిర్మాణ పనుల పురోగతిపై సమీక్ష
- నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం
- భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శన ఏర్పాట్లే దేవస్థానం లక్ష్యమని స్పష్టం
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కొండపై భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో చేపడుతున్న అభివృద్ధి పనులను దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్, ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని ప్రత్యక్షంగా తనిఖీ చేసి ఇంజినీరింగ్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం నుంచి ఘాట్ రోడ్డు వైపు వెళ్లే మార్గంలో భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపడుతున్న కాలిబాట విస్తరణ పనులను పరిశీలించారు. టికెట్ స్కానింగ్ కేంద్రం వద్ద భక్తుల రద్దీని తగ్గించి, దర్శనాన్ని మరింత సులభతరం చేసేలా క్యూలైన్ల క్రమబద్ధీకరణ పనులను కూడా తనిఖీ చేశారు. కొండపై నిర్మాణంలో ఉన్న నూతన ప్రసాదం పోటు (ప్రసాద తయారీ కేంద్రం), అన్నప్రసాద భవన నిర్మాణ పనుల పురోగతిని క్షుణ్ణంగా సమీక్షించిన ఈవో, చైర్మన్ పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేసి భక్తుల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీలో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎల్. రమాదేవి, ఇంజినీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
