ఎయిడ్స్‌పై విస్తృత అవగాహన కల్పించాలి
- ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 18 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు
- జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ రాహుల్ శర్మ
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : ఎయిడ్స్ వ్యాధి ఎలా సోకుతుంది, దాని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ సమన్వయ కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ మహమ్మారిపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు ఈ నెల 12 నుంచి అక్టోబర్ 18 వరకు జిల్లావ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వ్యాధి నివారణలో సరైన సమాచారం అందించడం అత్యంత కీలకమని, ముఖ్యంగా యువత, విద్యార్థులు, వ్యాధి ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని వైద్యశాఖ, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
విద్యార్థులకు ఎయిడ్స్‌పై శాస్త్రీయ అవగాహన కల్పించడంతో పాటు వ్యాధి ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాలను గుర్తించి అక్కడ ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. ఎయిడ్స్ నిర్మూలనలో స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమని, వారి సహకారంతో హెచ్‌ఐవీ పరీక్షల నిర్వహణను మరింత విస్తరించాలని తెలిపారు.
జిల్లా ప్రధాన ఆసుపత్రిలో అవసరమైన వైద్య సేవలను బలోపేతం చేస్తూ ఏఆర్‌టీ (యాంటీ రెట్రోవైరల్ థెరపీ) కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి, జిల్లా ప్రధాన ఆసుపత్రి పర్యవేక్షకులు డా. వెంకటరత్నం, ఆసుపత్రుల సమన్వయ అధికారి డా. శ్రీకాంత్, ప్రోగ్రామ్ అధికారి డా. సందీప్, మహాదేవపూర్ వైద్యులు డా. గోపీనాథ్, దిశా క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ జ్యోతి, ఐసీటీసీ కౌన్సిలర్ రమేష్, మారి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సదానందం, ఇతర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముస్తాక్, గోవర్ధన్, రజిని తదితరులు పాల్గొన్నారు.
