ఎల్‌నినో ప్రభావ నివారణకు ప్రత్యేక కార్యాచరణ
రైతన్నా మీకోసం కార్యక్రమంలో అవగాహన, సూచనలపై దృష్టి
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 7వ తేదీ నుంచి రైతుల వద్దకే వెళ్లి పంటల పరిస్థితులు, వాతావరణ ప్రభావం, నివారణ చర్యలపై అవగాహన కల్పించనున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే వర్షాభావ పరిస్థితులు, పంటల సంరక్షణ, నీటి వినియోగం, ప్రత్యామ్నాయ పంటల సాగు, వాతావరణానుకూల వ్యవసాయ పద్ధతులపై రైతులకు సూచనలు అందించనున్నారు. అలాగే గ్రామాల వారీగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో సమావేశాలు నిర్వహించి, పంటల నిర్వహణకు అవసరమైన సాంకేతిక సలహాలు ఇవ్వనున్నారు.
రైతులు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలని అధికారులు కోరారు. ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గిస్తూ దిగుబడులను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని తెలిపారు.
