అన్ని అత్యవసర సేవలకు ఒక్కటే నెంబర్
- తెలంగాణలో ‘డయల్ 112’ ప్రారంభం..
- 18 అత్యవసర సేవలకు ఇక ఒక్కటే నంబర్
- పోలీస్, ఫైర్, అంబులెన్స్ సేవలకు ఇక ‘112’కు డయల్ చేస్తే చాలు
- ఏఐతో అత్యవసర సేవల్లో తెలంగాణ కొత్త అడుగు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో అత్యవసర సేవలను మరింత వేగవంతంగా, సమర్థంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత ఆధారంగా రూపొందించిన ‘డయల్ 112’ సమగ్ర అత్యవసర సేవలను ఆగస్టు 5 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై పోలీస్, అగ్నిమాపక, అంబులెన్స్, మహిళా రక్షణ సహా మొత్తం 18 అత్యవసర సేవలు ఒకే నంబర్ 112 ద్వారా పొందే అవకాశం కల్పించింది.
హైదరాబాద్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGiCCC)లో డీజీపీ సి.వి. ఆనంద్ ఈ వ్యవస్థను అధికారికంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా అమలులో ఉన్న జాతీయ అత్యవసర సేవల విధానానికి అనుగుణంగా తెలంగాణ కూడా ఇకపై ‘డయల్ 112’ను ప్రధాన అత్యవసర నంబర్‌గా అమలు చేయనుంది.
ఇప్పటి వరకు పోలీసు అత్యవసర సేవల కోసం వినియోగించిన ‘డయల్ 100’ స్థానంలో ఇకపై 112 నంబర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఒకే కాల్‌తో అవసరమైన సేవను సంబంధిత విభాగానికి అనుసంధానం చేసేలా ఈ వ్యవస్థను రూపొందించారు.
ఏఐ ఆధారిత సాంకేతికతతో కాల్స్‌ను విశ్లేషించి అత్యవసర పరిస్థితులను వేగంగా గుర్తించే సామర్థ్యం ఈ వ్యవస్థకు ఉంది. కాలర్ లొకేషన్‌ను తక్షణమే గుర్తించి, సంఘటన స్థలానికి సమీపంలో ఉన్న పోలీసు పెట్రోలింగ్ వాహనం, అగ్నిమాపక సిబ్బంది లేదా అంబులెన్స్‌ను వెంటనే పంపించేలా చర్యలు చేపడతారు. దీంతో స్పందన సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
అత్యాధునిక కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థతో పాటు డ్రోన్ల అనుసంధానం, రియల్‌టైమ్ పర్యవేక్షణ వంటి సాంకేతిక సదుపాయాలను కూడా ఈ సేవలో భాగంగా వినియోగించనున్నారు. విపత్తులు, ప్రమాదాలు, నేరాల వంటి అత్యవసర పరిస్థితుల్లో మరింత సమర్థవంతమైన స్పందన అందించడమే ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
