Bharathiraja | పల్లె అందాలను ఆవిష్కరించిన దర్శకశిఖరం.. భారతీ రాజా
Bharathiraja | పల్లె అందాలను ఆవిష్కరించిన దర్శకశిఖరం.. భారతీ రాజా
Bharathiraja | పల్లె సౌందర్యానికి కెమెరా భాష నేర్పిన మాస్టర్ డైరెక్టర్
వైవిధ్యభరిత సినిమాలతో తనదైన ముద్ర వేసిన భారతీరాజా
నటుడిగానూ మెప్పించి అవార్డులతో సత్తా చాటిన సినీ దిగ్గజం
Bharathiraja | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ కొన్ని ప్రత్యేక పేజీలను రాసుకున్న గొప్ప దర్శకుడు, నటుడు భారతీ రాజా.. వైవిధ్యభరిత సినిమాలకే ఆయన ప్రాధాన్యం ఇచ్చేవారు. మట్టిసువాసన కెమరాలను ముద్దాడాయి అంటే అది కేవలం భారతీరాజా వల్లే అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.. ఇప్పుడున్న జెన్ జీ పిల్లలకు ఆయన కేవలం నటుడిగానే పరిచయం ఉండొచ్చు.. కానీ 1970, 80 దశకాల్లో ఆయన తన మార్క్ సినిమాలతో థియేటర్ల ముందు జనాలను క్యూ కట్టించారు. పల్లె సౌందర్యాన్ని కథగా.. అందులో నుంచి వచ్చే మట్టి సువాసనలనే బంధాలుగా ఆయన తీర్చిదిద్దిన పాత్రలు ఇప్పటికీ అజరామరం. పల్లెటూరి అందాలు, అక్కడి ప్రజల ప్రేమానురాగాలు చాలా హృద్యంగా ఆవిష్కరించారు. బంధాలు, బంధుత్వాలు వాటి మధ్య వెతలు, కథలు అత్యంత సహజసిద్ధంగా ఆయన ఆవిష్కరించిన తీరు ఇప్పటికీ ఆదర్శనీయమే.. ముఖ్యంగా స్టూడియోలకే పరిమితం అయిన సినిమాను పల్లెకు చేర్చిన ఘనత మాత్రం భారతీరాజాకే చెందుతుంది. చివరగా రామ్ గోపాల్ వర్మ, సుకుమార్ వంటి అగ్ర దర్శకులు సైతం వైవిధ్యాని ప్రాధాన్యం ఇచ్చారంటే అది కేవలం భారతీరాజా సినిమాల ప్రభావమే అంటూ స్వయంగా వారే చెప్పుకొచ్చారు. భారతీరాజా భౌతికంగా మనమధ్య లేకపోవచ్చు కానీ ఆయన తీసిన సినిమాలు.. గీసిన పాత్రలు ఇప్పటికీ.. ఎప్పటికీ.. చిరిస్థాయిలో నిలిచిపోతాయి.
భారతీరాజా 1941 జూలై 17న తమిళనాడులోని అల్లినగరంలో జన్మించారు. బాల్యం నుంచి ఆయనకు కళలంటేనే మక్కువ. 1977లో వచ్చిన తమిళంలో వచ్చిన ‘16 వయతినిలే’ భారతీరాజా మొదటి సినిమా.. అదే సినిమాను తెలుగులో ‘పదహారేళ్ల వయసు’ పేరుతో రీమేక్ చేశారు. నటీనటులకు మేకప్ లేకుండా సహజంగా చూపించడం ఆయన ప్రత్యేకత. పల్లె అందాలకే పరిమితం కాకుండా ఎగ్రగులాబీలు అనే సైకలాజికల్ థ్రిల్లర్ ద్వారా తనలోని బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. కమల్ హాసన్, శ్రీదేవి జంటగా నటించిన ఈ చిత్రం తెలుగులో ఘన విజయం సొంతం చేసుకుంది.
అలైగల్ ఒయివదిల్లై’ చిత్రం ద్వారా రాధను నాయికగా పరిచయం చేశారు. ఇదే చిత్రం తెలుగులో భారతీరాజా దర్శకత్వంలోనే ‘సీతాకోకచిలుక’గా రూపొందింది. ఈ సినిమా ద్వారా ముచ్చెర్ల అరుణ నాయికగా పరిచయమయింది. తెలుగులో కార్తిక్ కు ఇదే తొలి చిత్రం. ఇక భారతీరాజా రూపొందించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘టిక్ టిక్ టిక్’ కూడా అప్పటి యువతరాన్ని ఆకట్టుకుంది. తెలుగులో “యువతరం పిలిచింది, ఈ తరం ఇల్లాలు” వంటి చిత్రాలు రూపొందించి ఘన విజయం సాధించారు.
నటుడిగా కూడా భారతీ రాజా రాణించారు. మొదట్లో కొన్ని చిత్రాల్లో కేవలం అతిథి పాత్రలు చేసినా రాజా.. మణిరత్నం తెరకెక్కించిన ‘యువ’ సినిమా ద్వారా పూర్తిస్థాయి నటుడిగా మారారు. తరువాత పలు చిత్రాలలో నటించారు. శింబు హీరోగా వచ్చిన ఈశ్వరన్ లో కీలక పాత్ర పోషించి మెప్పించారు. 2022లో వచ్చిన ధనుష్ తీరు సినిమాలో ముఖ్య పాత్ర పోషించి ఆ సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోషించారు.
భారతీయ చలనచిత్ర రంగానికి చేసిన అసమాన సేవలకు గాను భారతీరాజాను ఎన్నో అవార్డులు వరించారు. ‘ఇయక్కునార్ ఇమయం’ (దర్శక శిఖరం) అనే బిరుదును పొందారు. తన కెరీర్‌లో దాదాపు 40 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన, 2004లో భారత ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని అందుకున్నారు. వివిధ విభాగాల్లో మొత్తంగా 6 జాతీయ చలనచిత్ర అవార్డులను సొంతం చేసుకున్న ఆయన, తన క్లాసిక్ తెలుగు చిత్రం ‘సీతాకోకచిలుక’కు గాను ఉత్తమ ప్రాంతీయ చిత్ర అవార్డును గెలుచుకున్నారు. వీటితో పాటు తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 4 ఫిలింఫేర్ అవార్డులు, 6 తమిళనాడు రాష్ట్ర అవార్డులు, నంది అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు.
