SIR Voter Revision | బీఎల్‌వోలు, బీఎల్‌ఏలకు మంత్రి జూపల్లి దిశానిర్దేశం
SIR Voter Revision | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : మహబూబ్‌నగర్ జిల్లా వీపనగండ్లలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) అవగాహన కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు), బూత్ లెవల్ ఏజెంట్లతో సమావేశమై ఎస్‌ఐఆర్ ప్రక్రియ పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
గ్రామాల వారీగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. వలస వెళ్లిన ఓటర్లను గుర్తించి వారిని ఫోన్ ద్వారా సంప్రదించి, అవసరమైన ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేయించేలా బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరుకు అవకాశం కల్పించడంతో పాటు, ఎలాంటి తప్పులకు తావులేకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని మంత్రి తెలిపారు.
నిర్దేశిత గడువులోగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసే బీఎల్‌వోలు, బీఎల్‌ఏలను ప్రోత్సహించేందుకు నగదు బహుమతులు అందజేస్తామని జూపల్లి ప్రకటించారు. ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి మొదటి బహుమతిగా రూ.10 వేల నగదు, ద్వితీయ బహుమతిగా రూ.5 వేల నగదు అందిస్తామని తెలిపారు. ప్రోత్సాహకాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతానికి కృషి చేయాలని మంత్రి కోరారు.
