ఆపదలో ఉన్న వ్యక్తికి గ్రామస్థుల భరోసా

వైద్య చికిత్స కోసం రూ.50 వేల ఆర్థిక సాయం అందజేత

దండేపల్లి, ఆంధ్రప్రభ : ఆపదలో ఉన్న వ్యక్తికి గ్రామస్థులు అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన గొండుగూడ వాసి కొమురం బాలు ఇటీవల ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పై నుంచి కిందపడటంతో కాలుకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి చెందిన కొమురం బాలు వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితి నెలకొనడంతో నర్సాపూర్ గ్రామస్థులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. గ్రామ ప్రజలు విరాళాల రూపంలో రూ.50 వేల నిధులు సేకరించి, బాధితుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్న వ్యక్తిని ఆదుకోవడానికి గ్రామస్థులంతా ఏకమై ముందుకు రావడం అభినందనీయమన్నారు. సమాజంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తీగల రాజయ్య, ఉపసర్పంచ్ గాండ్ల అశోక్ కుమార్, పంచాయతీ కార్యదర్శి కొట్టే మానస, గ్రామ పెద్దలు తొట్ల జేయన్న, కటికనపెల్లి వెంకన్న, కుర్సింగ కమలాకర్, పూరేళ్ల నర్సయ్య, గాండ్ల తిరుపతి, కొట్నాక బొజ్జురావు, తీగల ప్రశాంత్, పులిశెట్టి రాజన్న, గాజుల సత్తన్న తదితరులు పాల్గొన్నారు.