కేబినెట్ కీలక నిర్ణయాలు.. విద్యాశాఖలో పోస్టుల భర్తీకి ఆమోదం..

  • పాలమూరు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
  • పంచాయతీలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి..
  • బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ మార్పులకు ఓకే

హైదరాబాద్, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో పరిపాలన, విద్య, నీటిపారుదల, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. విద్యాశాఖలో ఖాళీ పోస్టుల భర్తీ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పెరిగిన అంచనా వ్యయం, బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ మార్పులు, గ్రామ పంచాయతీల ఆర్థిక స్వయం ప్రతిపత్తి తదితర అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే జగిత్యాల జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీ పోస్టుల భర్తీకి కూడా అనుమతి మంజూరు చేసింది.

సంగారెడ్డి జిల్లాలో వివిధ ప్రభుత్వ సంస్థలకు భూముల కేటాయింపుతో పాటు పటాన్‌చెరులో ఇందిరమ్మ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన భూముల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పరిపాలనా అనుమతులను కూడా మంజూరు చేసింది.

నీటిపారుదల రంగంలో కీలకమైన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పెరిగిన అంచనా వ్యయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించి అలైన్‌మెంట్ మార్పులకు కూడా అంగీకారం తెలిపింది.

గ్రామ పంచాయతీల ఆర్థిక స్వయం ప్రతిపత్తిని బలోపేతం చేసే దిశగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 70(3) సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇకపై గ్రామ పంచాయతీల సొంత ఆదాయం ట్రెజరీకి కాకుండా నేరుగా ఆయా గ్రామపంచాయతీల బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకోనుంది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను త్వరలో జారీ చేసే అవకాశం ఉంది.

ఇక ధరణి పోర్టల్‌లో జరిగిన అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలన్న కేబినెట్ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారగా, ప్రభుత్వం తీసుకున్న ఇతర నిర్ణయాలు విద్య, గ్రామీణాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, నీటిపారుదల రంగాలకు ఊతమివ్వనున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.