దైవిక వ్యర్థాల సేకరణకు విశేష స్పందన..

భక్తిశ్రద్ధలతో వినూత్న కార్యక్రమం

మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శనివారం నిర్వహించిన డివైన్ వేస్ట్ కలెక్షన్ (దైవిక వ్యర్థాల సేకరణ) కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. మేడ్చల్ సర్కిల్ పరిధిలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ వినూత్న కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు భక్తులు, స్థానిక ప్రజలు దేవుళ్ల పాత చిత్రపటాలు, పూజా క్యాలెండర్లు, విరిగిపోయిన విగ్రహాలు, ఫోటో ఫ్రేమ్‌లు వంటి దైవిక వ్యర్థాలను మున్సిపల్ సిబ్బందికి అందజేశారు. ఇళ్లలో పూజా గదుల్లో ఉంచలేని పాత దైవిక వస్తువులను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా, గౌరవప్రదంగా సేకరించి పర్యావరణానికి హాని కలగకుండా రీసైక్లింగ్ చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రాధాకృష్ణమూర్తి, మేడ్చల్ సర్కిల్-60 డిప్యూటీ కమిషనర్ ఎన్. సుదాంష్, మున్సిపల్ డీఈ విజయలక్ష్మి, మున్సిపల్ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

సేకరించిన దైవిక వ్యర్థాలను త్వరలో రీసైక్లింగ్ ప్రక్రియకు తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు. భక్తిభావంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఇటువంటి కార్యక్రమాలను మరిన్ని ప్రాంతాల్లో నిర్వహించాలని స్థానికులు అభిప్రాయపడ్డారు.