రైతుల సమక్షంలోనే రీసర్వే ..
- రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్
కంచికచర్ల, ఆంధ్రప్రభ : భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించడమే లక్ష్యంగా రైతుల సమక్షంలో పూర్తి పారదర్శకంగా రీసర్వే నిర్వహించాలని రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం కంచికచెర్ల గ్రామం, నందిగామ మండలం సోమవరం గ్రామాల్లో జరుగుతున్న రీసర్వే పనులను జిల్లా రెవెన్యూ, సర్వే అధికారులతో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల సమక్షంలో సర్వే జరుగుతుండటంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ మాట్లాడుతూ, గతంలో నిర్వహించిన రీసర్వేలో చోటుచేసుకున్న లోపాలు, భూ సరిహద్దుల నిర్ణయంలో జరిగిన పొరపాట్లు, జాయింట్ ఎల్పీ నంబర్ల వంటి సమస్యలు పునరావృతం కాకుండా రీసర్వే–2.0ను అమలు చేస్తున్నామని తెలిపారు. సర్వే ప్రారంభానికి ముందే సంబంధిత రైతులకు సమాచారం అందించి, వారి లేదా కుటుంబ సభ్యుల సమక్షంలోనే సర్వే నిర్వహించాలని, ఈ-కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచించారు. సర్వే అనంతరం డాక్యుమెంట్ల పరిశీలన ద్వారా భూ హద్దులను రైతు సమక్షంలోనే నిర్ధారించి, సరైన కొలతలతో కూడిన పట్టాదారు పాసుపుస్తకం అందే వరకు ప్రతి దశలో రైతులకు సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా రీసర్వే కార్యక్రమం వేగంగా కొనసాగుతోందని, ఫేజ్–1లో 628, ఫేజ్–2లో 748, ఫేజ్–3లో 729, ఫేజ్–4లో 1,645 గ్రామాల్లో సర్వే పూర్తవుతుండగా, ప్రస్తుతం ఫేజ్–5లో 1,343 గ్రామాల్లో సుమారు 2,800 బృందాలు అత్యాధునిక రోవర్ పరికరాలతో రీసర్వే నిర్వహిస్తున్నాయని తెలిపారు. రైతుల సమక్షంలో భూ వివరాలు, పత్రాలను సరిపోల్చడం ద్వారా భవిష్యత్తులో భూ వివాదాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2027 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్‌ను భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం, సర్వే శాఖ సమన్వయంతో కృషి చేస్తున్నట్లు డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్వేయర్ వై.మెహనరావు, నందిగామ డివిజన్ సర్వే ఇన్‌స్పెక్టర్లు జె.బసవరావు, సాంబశివరావు, మండల సర్వేయర్ నరేంద్ర, రెవెన్యూ, సర్వే శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
