అయోధ్యలో రూ.250 కోట్ల స్కాంపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలి

ఎంపీ గడ్డం వంశీకృష్ణ

వెల్గటూర్, ఆంధ్రప్రభ : దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం తప్ప బీజేపీ హిందువుల కోసం చేసిందేమిటో చెప్పాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నించారు. అయోధ్యలో రూ.250 కోట్ల స్కాం జరిగిందని వస్తున్న ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

శనివారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవుడి పేరుతో వచ్చిన నిధులను దుర్వినియోగం చేసిన వారెవరైనా చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సిందేనని అన్నారు.

గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు తెలంగాణకు చేసిందేమీ లేదని విమర్శించారు. గత రెండేళ్లుగా పార్లమెంట్‌లో రాష్ట్ర మౌలిక వసతుల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతున్నామని చెప్పారు.

ఎన్‌హెచ్-63 రహదారిని ధర్మపురి–లక్షెట్టిపేట–మంచిర్యాల–చెన్నూరు వరకు అనుసంధానించే రహదారి అభివృద్ధి కోసం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి పలుమార్లు వినతిపత్రాలు అందజేశామని, ఫలితంగా కేంద్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్ల నిధులను మంజూరు చేసిందని తెలిపారు.

అదేవిధంగా నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎంపీ విమర్శించారు. ప్రశ్నపత్రాల లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని అన్నారు. నెలల తరబడి కష్టపడి చదివిన విద్యార్థులను కేవలం ఐదు లేదా పది నిమిషాలు ఆలస్యంగా వచ్చారనే కారణంతో పరీక్షకు అనుమతించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థుల సమస్యల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పేపర్ లీకేజీలను అరికట్టి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మెరుగు మురళీ గౌడ్, పోరం మండల అధ్యక్షుడు గండ్ర ప్రతాప్‌రావు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు బందెల ఉదయ్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జూపాక ప్రవీణ్, వార్డు సభ్యులు గుండాటి సందీప్ రెడ్డి, నక్క సురేష్, నాయకులు గుమ్ముల అజయ్ తదితరులు పాల్గొన్నారు.