బహదూర్‌గూడ భూముల వద్ద తీవ్ర ఉద్రిక్తత

రైతుల ఆందోళన.. పోలీసులు–రైతుల మధ్య తోపులాట

శంషాబాద్, ఆంధ్రప్రభ : : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని బహదూర్‌గూడ గ్రామంలో శనివారం భూముల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం తమ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. “మా భూములు మాకు కావాలి” అంటూ నినాదాలు చేస్తూ అధికారుల చర్యలను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

కొంతకాలంగా తమ భూములను కాపాడుకోవాలని రైతులు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ, అధికారులు భూముల స్వాధీన ప్రక్రియను కొనసాగించేందుకు ముందుకు రావడంతో రైతుల్లో ఆగ్రహం మరింత పెరిగింది. హైడ్రా అధికారులు జేసీబీల సహాయంతో భూముల వద్ద ఫెన్సింగ్ వైర్లు ఏర్పాటు చేయడం ప్రారంభించగా, రైతులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో రైతులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. తోపులాటలో రైతు నరసింహ అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే అతడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు ప్రయత్నించగా, తోటి రైతులు అడ్డుకుని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

భూముల వద్దకు రైతులు వెళ్లకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. తమ సొంత భూముల్లోకి కూడా వెళ్లనివ్వడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.

ఇదే సమయంలో రైతులకు మద్దతుగా వెళ్లేందుకు ప్రయత్నించిన టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ పరిణామంతో రాజకీయంగానూ ఈ భూముల వివాదం చర్చనీయాంశంగా మారింది.

భూముల స్వాధీనం విషయంలో ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని, రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు గ్రామంలో భారీ బందోబస్తు కొనసాగిస్తున్నారు.

బహదూర్‌గూడలో నెలకొన్న ఈ పరిణామాలు స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీయగా, భూముల వివాదం ఎటువైపు దారితీస్తుందనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అధికారుల తదుపరి చర్యలు, రైతుల ఆందోళన ఎలా కొనసాగుతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.