ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం..

13 మంది విద్యార్థినులు అస్వస్థత

సూర్యాపేట, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. శనివారం ఉదయం అల్పాహారంగా ఉప్మా తిన్న అనంతరం 13 మంది బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.

విద్యార్థినులను వెంటనే సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారిలో ముగ్గురు విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ఘటనతో కళాశాలలో ఆందోళన నెలకొంది. అయితే ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపల్ సరైన వివరాలు వెల్లడించకుండా దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని విద్యార్థినులు ఆరోపించారు. కళాశాల సిబ్బంది కూడా వెంటనే స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఫుడ్ పాయిజన్ ఘటనపై సంబంధిత అధికారులు వెంటనే సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు.